మత్తు వదలండి.. ఉన్నత శిఖరాలను అధిరోహించండి: శ్రీనివాస్

​కలం, బోనకల్: యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎయిడ్ (AID) సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె. శ్రీనివాస్ (AID District Coordinator Srinivas) పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల మాయలో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన విద్యార్థులకు హితవు పలికారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్ (Bonakal) ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ లింగంనేని నళినిశ్రీ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు బాలల హక్కులను సద్వినియోగం చేసుకుంటూ సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, బాలలపై లైంగిక దాడులు తదితర సామాజిక రుగ్మతలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. కౌమార దశలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని తల్లిదండ్రులు, గురువుల సూచనలను పాటించాలని తెలిపారు.

​ఎక్కడైనా బాలల హక్కులకు భంగం కలిగినా, ఆపద ఎదురైనా వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా పోలీస్ అత్యవసర నంబర్ 100ను సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు. కెరీర్ గైడెన్స్, మనోవికాసం, ఆత్మస్థైర్యంతో సమస్యలను ఎదుర్కొనే తీరుపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సదస్సు ముగింపులో బాల్యవివాహాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అంతోటి తిరుపతిరావు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, టీమ్ సభ్యులు రాందాస్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>