ఇందిరమ్మ బీమా సర్వేకు కలెక్టర్ ఆదేశాలు

కలం, కరీంనగర్: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (Indiramma Family Life Insurance) వివరాల సేకరణకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) అధికారులను ఆదేశించారు. సర్వేలో ఏ ఒక్క కుటుంబం కూడా మిగిలిపోకూడదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పథకం అమలుకు చేపట్టాల్సిన చర్యలు, కుటుంబాల వివరాల సేకరణ, క్షేత్రస్థాయి పర్యవేక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతి గ్రామంలో ప్రత్యేక బృందాలు

శుక్రవారం నుంచే జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో గ్రామంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి, జీపీఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్ సభ్యులుగా ఉండే ఈ బృందాలు కుటుంబ యజమాని, నామినీ, కుటుంబ సభ్యుల పూర్తి సమాచారాన్ని నమోదు చేయాలని తెలిపారు.

ఎవరి వివరాలూ మిస్ కావద్దు

పథకం అమలులో వివరాల సేకరణ అత్యంత కీలకమని, ఈ ప్రక్రియలో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని, ఎవరి సమాచారం కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది బాధ్యతగా పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రోజువారీ పర్యవేక్షణ తప్పనిసరి

మండల స్థాయిలో ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు, ఎంపీవోలు గ్రామాల వారీగా వివరాల నమోదు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. సర్వే పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్ణీత సమయంలో వివరాల సేకరణ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో స్వామి, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>