Mobile Popup Ad
Mobile Popup Ad

ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులతో ఆదివాసీల పోడు ఘర్షణ

కలం/ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులకు, ఆదివాసీలకు మధ్య పోడు భూముల ఘర్షణ కొనసాగుతోంది. దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామ పంచాయతీలో ఆదివాసీలకు సమాచారం ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు రాత్రి సమయాల్లో ప్లాంటేషన్ కోసం జేసీబీ లతో కందకాలు తవ్వుతున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు, గిరిజనులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అలాగే అశ్వరావుపేట మండలం ఉరుముల బండ గ్రామంలో అధికారులు కందకాలు తవ్వుతుండటంతో గిరిజనులు అడ్డుకున్నారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో ఏడుగురు గిరిజనులు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రభుత్వం అటవీ సంరక్షణ నియమాల పేరుతో ఆదివాసీల పోడు భూములు గుంజుకొని, వారిని అడవి నుంచి వేళ్ల గొట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. పీసా చట్టాన్ని, 1/70 చట్టాన్ని పట్టించుకోకుండా ఆర్ఓ ఎఫ్ఆర్ కమిటీకి, గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు రాత్రుళ్లు ఎందుకు కందకాలు తవ్వుతున్నారంటూ ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ నియమాల ప్రకారం 2005 కంటే ముందు నుంచి పోడు చేసుకుంటున్న రైతుల జోలికి ఫారెస్ట్ అధికారులు రాకూడదని ఆదివాసీలు గుర్తు చేస్తున్నారు. అధికారులు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆదివాసీలపై దాడులు ఆపాలని, పోడు భూముల జోలికి రావద్దని ఆదివాసీ సానుభూతి పరులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మొండి వైఖరి వీడకుంటే ఆదివాసీ ప్రజలను ఐక్యం చేసుకొని ఉద్యమాలను ఉదృతం చేస్తామని న్యూ డెమోక్రసీ పార్టీ నేతలు సతీష్ తదితరులు హెచ్చరించారు.

Read Also: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక.. మార్చి 6 నుంచి 99 రోజుల యాక్షన్ ప్లాన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>