కలం, నిజామాబాద్ బ్యూరో : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ (Nizamabad) లో బాలల భద్రత డ్రగ్స్, రహిత తెలంగాణ సంక్షేమ వారోత్సవాలు ఏప్రిల్ 27 తేదీ నుంచి మే 2 వరకు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 18 ఏళ్లు పైబడిన చైల్డ్ కేర్ ఇన్సిట్యూషనల్ సీసీఐ పిల్లల కోసం ఆఫ్టర్ కేర్ ప్రోగ్రాం నిర్వహించారు. నిజామాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవతా సదన్ లో చదువుకుంటున్న పిల్లలకి కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను, బ్యాంక్ అకౌంట్ లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బాలల భద్రత రక్షణ కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో అందరి సహకారం అవసరమని, దీనికోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. బాలల హక్కులను పరిరక్షించాలన్నారు. బాలలకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అందుకోవాలని పిల్లలకు సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి పద్మ మాట్లాడుతూ, జిల్లా (Nizamabad) కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు వారం రోజులపాటు బాలల భద్రత రక్షణ కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం బాలల హక్కులు, బాల కార్మిక నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సాయన్న, డీఎంహెచ్ఓ రాజశ్రీ, డీసీపీఓ చైతన్యకుమార్ మానవతా సదన్, ఇంచార్జి రమేశ్, శ్రీహరి చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ జ్యోష్ణ, తదితరులు పాల్గొన్నారు.

