కలం, వెబ్ డెస్క్ : విశాఖకు గూగుల్ రాక ఏపీకి గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. విశాఖలోని ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఏపీ చరిత్రలో మరిచిపోలేని రోజు.. ఏపీలో ఇవాళ్టి నుంచి కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు.
గూగుల్ రావడం తనకెంతో గర్వకారణంగా ఉందని చంద్రబాబు వెల్లడించారు. టెక్నాలజీలో ఏపీ సగర్వంగా తలెత్తుకు నిలబడుతుందన్న సీఎం చంద్రబాబు.. ఆసియాలో అతిపెద్ధ డేటా సెంటర్ విశాఖలో నిర్మించబోతున్నామని వివరించారు. 1997లో హైటెక్ సిటీలో ఐటీ విప్లవానికి నాంది పలికినట్లుగానే.. నేడు ఏఐ విప్లవానికి నాంది పలుకుతున్నట్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. అమెరికాలోని గూగుల్ క్యాంపస్ కి వెళ్లి నారా లోకేష్ చర్చలు జరపడం వల్ల రాష్ట్రానికి గూగుల్ ఏఐ సెంటర్ వచ్చిందని పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ రాకాతో ఆసియాలో భారతదేశానికి అంతర్జాతీయ గేట్ వే గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పారు. 2028 సెప్టెంబర్ 28 వరకు ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

