కలం, నల్లగొండ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఉమ్మడి నల్లగొండ ఆదర్శంగా నిలవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవితాల్లో శాశ్వత మార్పునకు దారితీస్తున్నాయన్నారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రయోజనాలు చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అత్యంత వెనుకబడిన వర్గాల పట్ల సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మొదటి విడత బిల్లులు పొందిన లబ్ధిదారులకు తదుపరి బిల్లులు కూడా ఆలస్యం లేకుండా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.
విద్య, ఉపాధి, గృహ భద్రత ఈ మూడు కలిసి పేద కుటుంబ భవిష్యత్తును మార్చగలవని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమగ్ర సంక్షేమ విధానాలతో ముందుకు సాగుతోందన్నారు. భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, భూరికార్డుల్లో పారదర్శకత తీసుకురావడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని, అర్హులకే లబ్ధి చేకూరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరిగేలా ప్రతి అధికారి కట్టుదిట్టంగా విధులు నిర్వర్తించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.
హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, కోదాడ, నల్గొండ, ఆలేరు, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, హౌసింగ్, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

