కలం, ఆదిలాబాద్: వేసవిలో ఎల్నినో ప్రభావం కారణంగా నీటి కొరత తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా (Adilabad)లో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు, పశువులకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో తాగునీటి సరఫరా, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని చివరి గ్రామం నుంచి మారుమూల ఆవాసాల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నారు. నీటి వృథాను అరికట్టేందుకు పైప్లైన్ లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. పశువులకు సైతం తాగునీటి కొరత లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని ప్రజలు, రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.
సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యాన పంటలు, కూరగాయలు, పామాయిల్, నూనెగింజల సాగును ప్రోత్సహించి పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో తాగునీరు, సాగునీరు, పశువులకు అవసరమైన నీరు, పశుగ్రాసం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

