కలం, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని, ప్రతి నెలా తన ఎమ్మెల్యే జీతం నుంచి రూ.లక్షను జర్నలిస్టుల సంక్షేమం కోసం కేటాయిస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) ప్రకటించారు. జడ్చర్లలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని, త్వరలోనే పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయిస్తానని తెలిపారు. సోమవారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జర్నలిస్టులు నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావాలని సూచించారు. ఇటీవల జర్నలిస్టులపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని, అలాంటి పరిస్థితులు రాకుండా జర్నలిస్టులు తమ వృత్తి నిబద్ధతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
జర్నలిస్టులు నిజాయితీగా పనిచేస్తే ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు సక్రమంగా అందేలా చేయవచ్చని పేర్కొన్నారు. జర్నలిస్టులు నిజాయితీ, న్యాయం వైపు నిలబడితే వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగితే నిర్భయంగా వార్తలు రాయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు లంచాలు వసూలవుతున్నాయని ఆరోపించారు. అవినీతిని వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రాజకీయ నాయకులు, ప్రభుత్వం, జర్నలిస్టుల మధ్య సమన్వయం అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను భయపడకుండా వెలుగులోకి తీసుకురావాలని, అవినీతిని అరికట్టడంలో జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జర్న లిస్ట్ సంఘ నాయకులు కృష్ణ ,సుల్తాన్ ,శేఖర్, మల్లేష్, ప్రభాకర్ ,శ్రీనివాస్ ,కిరణ్ లతోపాటు జర్నలిస్టులు. కళాశాల సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

