కలం, ఆదిలాబాద్: విద్యార్థులు బాల్యం నుంచే మంచి అలవాట్లు, క్రమశిక్షణ, సత్ప్రవర్తనను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ (Adilabad Collector) రాజర్షి షా సూచించారు. తలమడుగు (Talamadugu) మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ‘ఆరోగ్య పాఠశాల–ఆరోగ్య జాతర’, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ పోషణ్ మాసం కార్యక్రమాలను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ గదిని ప్రారంభించి విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే ‘ఆరోగ్య పాఠశాల–ఆరోగ్య జాతర’ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
మత్తు పదార్థాల వినియోగంతో యువత భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించిన కలెక్టర్.. విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి సాగు, విక్రయం, వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలోని విద్యార్థులు బాసర ట్రిపుల్ఐటీలో అధిక సంఖ్యలో సీట్లు సాధించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు ఆరోగ్యం, క్రమశిక్షణ, సత్ప్రవర్తనపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, తహసీల్దార్ రాజ్మోహన్, ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు, సర్పంచ్ రాజన్న తదితరులు పాల్గొన్నారు.

