కలం, మహబూబ్నగర్ బ్యూరో: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ పద్ధతుల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపుకై సర్కారుపై సమరానికి సిద్ధం కావాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర కార్యదర్శి సురేష్ పిలుపునిచ్చారు. గురువారం ఎదిర శివారులోని మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల పారిశుద్ధ్య సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులతో ప్రభుత్వ విధానాలు కార్మిక జీతభత్యాల పెంపు అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న కార్మికుల పట్ల సవితి తల్లి ప్రేమ ప్రదర్శిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఏజెన్సీల కాల పరిమితి ముగిసి దాదాపు రెండేళ్లకు దగ్గరవుతున్న వాటిని రద్దు చేయకుండా కార్మికులకు జీతాలు పెంచకుండా మాయమాటలతో కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని అన్నారు. అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న అధిక ధరలతో చాలీచాలని జీతాలతో కార్మికులు అల్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలు లోపభూయిష్టంగా ఉందని ప్రభుత్వం పెంచిన జీతాలు పెరిగినట్టుగా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవంగా ప్రస్తుత జీతాల కన్నా భారీగా వేతనాలు తగ్గుతున్నాయని ఆరోపించారు. కావున జీవో నెంబర్ 6ను పరిశీలించి, ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలన్నారు.
అలాగే కాలం చెల్లిన ప్రస్తుత ఏజెన్సీలను రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా నేరుగా కార్మికులకు జీతాలు అందించాలని పండగ జాతీయ ఆర్చిత సెలవులు ఇవ్వాలని కోరారు. ఒక నెల జీతం బోనస్ చెల్లించాలని, తదితర డిమాండ్ల సాధన కోసం నవంబర్ 12 నుండి ఆసుపత్రి కార్మికుల పోరుబాట నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏఐటీయూసీ యూనియన్ నేతలు కార్మికులు సాయి ప్రకాష్, శ్రీనివాస్, ఉమర్, శ్రీను, నరేష్, రామకృష్ణ, చిట్టెమ్మ, అనసుయమ్మ, అంజమ్మ, యాదమ్మ, కృష్ణమ్మ, లక్ష్మి, చందన, సుజాత, మంజుల తిరుపతమ్మ, మన్నెమ్మ సత్యమ్మ భూదేవి భాగ్యలక్ష్మి మాధవి దేవమ్మ, రాధా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

