కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో మరోసారి ఏసీబీ (ACB) అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రిలో 2014 నుంచి ఉన్న రికార్డులను పరిశీలిస్తున్నారు. వివిధ విభాగాలకు చెందిన సుమారు 40 మంది అధికారుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ తనిఖీలో 10 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత నెలలో ఏసీబీ దాడిలో డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు సోదాలు చేసి ఆయనపై కేసు నమోదు చేశారు.
లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు కలుపుకొని సుమారు 12 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఆయనకు ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు. సుమారు రూ.6 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. లక్ష్మీ భాస్కర్ నిమ్స్ ఆస్పత్రి అడిషనల్ సూపరింటెండెంట్‌గా ఉన్నారు. ఈ వ్యవహారం అనంతరం మరోసారి ఆస్పత్రిలో ఏసీబీ ఎంట్రీతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికారుల తనిఖీల్లో ఏయే విషయాలు వెలుగులోకి వస్తాయన్నది వేచి చూడాలి.

