కలం, స్పోర్ట్స్: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అదరగొట్టాడు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రతి బంతిని బౌండరీ దాటించడమే ధ్యేయంగా ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు చేసి వెస్టిండీస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. కానీ అభిషేక్ వికెట్ పడటంతో భారత స్కోర్ నెమ్మదించింది. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒగరుగా భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆశించిన స్థాయి బ్యాటింగ్ చేయలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 223 పరుగులకు ఆలౌట్ అయింది.
టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు స్టార్టింగ్‌లోనే భారీ షాక్ తగిలింది. రెండో టీ20లో అదరగొట్టిన సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశాడు. 6 బంతుల్లో 3 పరుగులు చేసి షామర్ జోసెఫ్ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. కానీ వన్ డౌన్లో దిగిన ఇషాన్ కిషన్‌తో కలిసి అభిషేక్ శర్మ స్కోర్ కార్డ్‌ను వేగంగా పరుగులు పెట్టించాడు.115 పరుగుల దగ్గర ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయాడు. 18 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 పరుగులు చేసిన కిషన్ క్యాచ్ అవుటయ్యాడు. దాంతో అభిషేక్ కాస్తంత జాగ్రత్తగా ఆడటం షురూ చేశాడు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(1) అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ తన వికెట్ కోల్పోయాడు. అప్పటికే అభిషేక్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ నిలబడతాడనుకున్నా 28 పరుగులకే వెనుదిరిగాడు.నమన్ ధీర్(10), నితీష్ కుమార్ రెడ్డి(21), అక్సర్ పటేల్(20), అర్ష్‌దీప్ సింగ్ (11), ప్రిన్స్‌యాదవ్ (13), మయాంక్ యాదవ్ (0) పరుగులు చేశారు. దీంతో అభిషేక్ శర్మ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
వెస్టిండీస్ బౌలర్లలో ప్రతి ఒక్కరూ తమ ఖాతాలో వికెట్ వేసుకున్నారు. ఛేజ్, జోసెఫ్, స్ప్రింగర్ తలా రెండు వికెట్లు తీశారు. కీమో పాల్, గుడకేష్ మోటీ చెరో వికెట్ తీశారు. భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో ప్రతి విండీస్ బౌలర్ సక్సెస్ అయ్యారు. జోసెఫ్ 4 ఓవర్లకు 54 పరుగులిచ్చి అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా నిలిచాడు.
అభిషేక్ రికార్డ్
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మరో రికార్డ్ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో 2000 పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డ్ ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉంది. సూర్యకుమార్ 1164 బంతుల్లో 2వేల పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 1024 బంతుల్లో ఈ మార్క్‌ను అందుకున్నాడు. దాంతో పాటుగానే 18 బంతుల్లో అర్థశతకం బాది వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

