కలం, వెబ్ డెస్క్ : 2019లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 (F-16) ఫైటర్ జెట్‌ను కూల్చివేసి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ వైమానిక దళం (IAF) మాజీ గ్రూప్ కెప్టెన్, వీర్ చక్ర గ్రహీత అభినందన్ వర్ధమాన్ (Abhinandan Varthaman) ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఈ ఏడాది మార్చి నెలలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి పదవీ విరమణ చేసిన 43 ఏళ్ల అభినందన్, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందిన అనంతరం కమర్షియల్ ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టారు. గోవా కేంద్రంగా పనిచేస్తున్న రీజినల్ ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ ‘ఫ్లై91’ (Fly91) లో ఆయన పైలట్‌గా చేరారు. గత నెలలోనే ఆయన ఈ సంస్థలో బాధ్యతలు స్వీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
2019 ఫిబ్రవరిలో బాలాకోట్ దాడుల తర్వాత భారత్, పాకిస్థాన్ వైమానిక దళాల మధ్య జరిగిన పోరులో అభినందన్ ప్రదర్శించిన తెగువ చరిత్రలో నిలిచిపోయింది. శత్రుదేశానికి చెందిన శక్తివంతమైన ఎఫ్-16 విమానాన్ని తన మిగ్-21 బైసన్ (MiG-21 Bison) జెట్‌తో కూల్చివేసిన ఆయన, ఆ ప్రక్రియలో తన విమానం దెబ్బతినడంతో పాకిస్థాన్ భూభాగంలో పారాచూట్ ద్వారా దిగాల్సి వచ్చింది.
అక్కడ మూడు రోజుల పాటు పాక్ ఆర్మీ అదుపులో ఉన్నప్పటికీ, భారత్ తెచ్చిన దౌత్యపరమైన ఒత్తిడికి తలొగ్గి పాకిస్థాన్ ఆయనను సురక్షితంగా మాతృదేశానికి అప్పగించింది. యుద్ధ సమయంలో ప్రదర్శించిన అసమాన సాహసానికి గానూ భారత ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక ‘వీర్ చక్ర’ పురస్కారాన్ని అందజేసింది. వైమానిక దళంలో విశిష్ట సేవలు అందించిన అనంతరం, ఇప్పుడు ఒక ప్రైవేట్ ప్రాంతీయ విమానయాన సంస్థ ద్వారా కమర్షియల్ పైలట్‌గా ప్రజలకు సేవలు అందించేందుకు అభినందన్ (Abhinandan Varthaman) సిద్ధమయ్యారు.
Also Read : బొల్లారం ఆయుధాల మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. డిటోనేటర్ల కలకలం!
Follow Us On : WhatsApp

