కలం, వెబ్ డెస్క్ : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (Shamshabad ORR) పై భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ నుంచి మహారాష్ట్రలోని తుల్జాపూర్ వైపు సిమెంట్ బస్తాల లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పింది. ప్రమాదవశాత్తు ఫ్లైఓవర్ రెయిలింగ్‌ను ఢీకొట్టి, కింద ఉన్న సర్వీస్ రోడ్డు పక్కన పొదల్లో పడిపోయింది.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ (40) ఇల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఆర్జీఐఏ (RGIA) పోలీసులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు.
ఘటనతో ఓఆర్ఆర్ పరిసరాల్లో లారీ శకలాలు, సిమెంట్ బస్తాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆర్జీఐఏ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ల సాయంతో లారీ శకలాలను, రోడ్డుపై పడిన సిమెంట్ బస్తాలను తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

