కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని కాసర్ (కంచెరోని) చెరువు (Kasar Cheruvu) ఆక్రమణలను తక్షణమే తొలగించి, చెరువు భూములను పరిరక్షించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. చెరువు పరిధిలోని సర్వే నంబర్ 1374లో సుమారు 29 గుంటల శిఖం భూమితో పాటు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఆక్రమణలు జరిగాయని, అక్రమ పట్టాలు సృష్టించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు.
సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర సర్వే నిర్వహించాలని, అక్రమ పట్టాలను రద్దు చేసి నిర్మాణాలను తొలగించాలని కోరారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు స్పందించకపోతే చెరువు పరిరక్షణ కోసం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)ను ఆశ్రయిస్తామని తెలిపారు.

