కలం, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu)పై ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఇటీవల వంశీకృష్ణ శ్రీధర్ బాబుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ బీఎం సందీప్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన మంత్రి అడ్లూరిని ప్రత్యేకంగా గాంధీ భవన్‌కు రావాలని ఆహ్వానం పంపించారు. త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్న సందీప్ అడ్లూరిని ప్రత్యేకంగా పిలిపించడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ అంశంపై నేడు అడ్లూరి మీడియాతో మాట్లాడారు.
శ్రీధర్ బాబుతో వంశీకృష్ణకు ఏదైనా సమస్యలు ఉంటే బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని అడ్లూరి పేర్కొన్నారు. పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు శ్రీధర్‌బాబు పెద్ద దిక్కు లాంటి వారన్నారు. తాను కార్యకర్త నుంచి పార్టీలో ఈ స్థాయికి ఎదిగేందుకు శ్రీధర్ బాబు ఎంతో సహకరించారన్నారు. తనలాంటి దళిత నాయకులు ఈరోజు ఈ స్థానంలో ఉన్నారంటే దానికి శ్రీధర్ బాబు కారణమని పేర్కొన్నారు. తామంతా కష్టపడి వంశీకృష్ణను పెద్దపల్లి నుండి ఎంపీగా గెలిపించామని చెప్పారు. వంశీకృష్ణ తనకు తమ్ముడి లాంటి వాడని, శ్రీధర్ బాబుపై తాను ఇలా విమర్శలు చేయడం, లేఖలు, ఫిర్యాదులు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకోవాలని చెప్పారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబుపై సీఎస్‌కు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత శాఖల మంత్రుల పేర్లు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ప్రోటోకాల్‌ను విస్మరించిన మంత్రి శ్రీధర్ బాబుపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. సొంత పార్టీ మంత్రిపై ఫిర్యాదు చేయడం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

