కలం, వెబ్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్ (Womens T20 World Cup) 2026లో భారత్‌కు కఠినమైన గ్రూప్ దక్కినా, అదే జట్టును మరింత బలంగా తీర్చిదిద్దుతుందని మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ గెలవాలంటే బలమైన జట్లను ఎదుర్కోవడం తప్పదని ఆయన పేర్కొన్నాడు. భారత్ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి అగ్ర జట్లు ఉన్నాయి. దీంతో నాకౌట్ దశకు చేరుకోవడం సవాలుగా కనిపిస్తోంది. అయితే మరో గ్రూప్‌లో ఉన్నా న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లతోనే పోటీ పడాల్సి వచ్చేదని చోప్రా గుర్తు చేశాడు. ప్రపంచకప్ గెలవాలంటే కఠిన పరీక్షలను దాటాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డాడు.
భారత్ షెడ్యూల్ మాత్రం కొంత అనుకూలంగా ఉందని చోప్రా చెప్పాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో ఆడే అవకాశం ఉండటంతో జట్టు లయ అందుకునే అవకాశముందని పేర్కొన్నాడు. అలాగే గ్రూప్ దశలో కేవలం విజయాలు సాధించడం మాత్రమే కాకుండా, భారీ తేడాతో గెలవడం కూడా కీలకమని ఆయన సూచించాడు. పాకిస్థాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ వంటి జట్లపై మంచి ఆధిక్యంతో గెలిస్తే నెట్ రన్‌రేట్ కూడా జట్టుకు ఉపయోగపడుతుందని తెలిపాడు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ వచ్చే సమయానికి భారత్ నాకౌట్ దశకు చేరువలో ఉండేలా పరిస్థితి ఉండాలని చోప్రా అభిప్రాయపడ్డాడు. అలా జరిగితే ఒత్తిడి ప్రత్యర్థి జట్టుపై ఉంటుందని వివరించాడు. భారత్ మహిళల జట్టు బ్యాటింగ్‌లో కూడా పెద్ద మార్పు వచ్చిందని చోప్రా పేర్కొన్నాడు. గతంలో ఇతర జట్లతో పోలిస్తే ఎక్కువ సిక్సర్లు కొట్టే సామర్థ్యం భారత్‌కు తక్కువగా ఉండేదని, అదే టీ20 టోర్నీల్లో వెనుకబడడానికి ఒక కారణమని చెప్పాడు.
అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని ఆయన వివరించాడు. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్ లాంటి ఆటగాళ్లు నిలకడగా సిక్సర్లు బాదగలరని గుర్తు చేశాడు. అవసరమైతే భారతి ఫుల్మాలి కూడా ఆ పాత్ర పోషించగలదని పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ అంతటా పవర్ హిట్టర్లు ఉన్నారని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఆధునిక టీ20 క్రికెట్‌లో అలాంటి సామర్థ్యం చాలా అవసరమని, భారత్ ఇప్పుడు ఆ విషయంలో గతంతో పోలిస్తే మరింత బలంగా కనిపిస్తోందని చెప్పాడు.

