కలం, వెబ్ డెస్క్: పాలమూరు శాశ్వత నీటి సమస్య పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) అన్నారు. పాలమూరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటకలోని గూడూరు ప్రాంతాన్ని సందర్శించి “కర్ణాటకలో నీళ్లు – తెలంగాణలో బీళ్లు” అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయంగా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కర్ణాటకలో ఆనకట్టలు నిర్మించినప్పుడు ఒక్కసారి కూడా వెళ్లి ప్రశ్నించలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం జూరాల ప్రాజెక్టు పరిధిలోని రైతుల ప్రయోజనాలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ కృష్ణా, భీమా నదులపై బ్యారేజ్-కమ్-బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్లు సిద్ధం చేశామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కర్ణాటక సాగునీటి శాఖ మంత్రులతో కలిసి హెలికాప్టర్ ద్వారా ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించి కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. మంచి చేయలేకపోయినా చెడు చేయొద్దని.. ప్రజలను మోసం చేసే రాజకీయాలు మానుకోవాలని అన్నారు.

