కలం, కరీంనగర్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా పేదల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ (Vemulawada) ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఆది శ్రీనివాస్ భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 24 వేల కొత్త కుటుంబాలకు రేషన్ కార్డులు అందించామని ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 1.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. రేషన్ కార్డు కేవలం సరుకుల కోసం మాత్రమే కాకుండా పేద కుటుంబాలకు ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ప్రభుత్వం అందిస్తోందన్నారు. పేదలు, సంపన్నులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు.
అప్పుల భారంలోనూ సంక్షేమం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదన్నారు. గత పాలనలో రాష్ట్రంపై భారీగా అప్పుల భారం పడిందని, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆశిరెడ్డిపల్లితో తనకు రాజకీయంగా విడదీయరాని అనుబంధం ఉందని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. 1995లో కొచ్చేరు చెరువుకు గండి పడిన అనంతరం, తాను జడ్పీటీసీగా ఉన్న సమయంలో 1996లో పాదయాత్ర చేసి చెరువు మరమ్మతులకు రూ.45 లక్షలు మంజూరు చేయించేందుకు కృషి చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం కొచ్చేరు చెరువులోకి నీటిని తీసుకురావడానికి కాలువ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని, భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. వేములవాడ మూడో వంతెన నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడం తనకు లభించిన అరుదైన అవకాశమన్నారు.
ఎన్నికలు కేవలం 15 రోజుల రాజకీయ పోటీ మాత్రమేనని, అనంతరం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. తాను 4 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మధ్యే ఉంటూ 5వసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం పొందానని గుర్తు చేశారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు తన ఎమ్మెల్యే పదవిని అంకితం చేశానని, ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.

