కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు జూన్ 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (TG Movement Recognition Committee) నిర్ణయించింది. శనివారం తెలంగాణ సచివాలయంలో చైర్మన్ కే.కేశవరావు అధ్యక్ష్యతన కమిటీ సమావేశం అయింది. భేటీలో కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి లతో పాటు ఉన్నతాధికారులు పాల్గొని విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. కమిటీ ఏర్పాటు అనంతరం తొలిసారిగా సచివాలయంలో నేడు సమావేశమయింది.
ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ కే.కేశవరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వారందరిని గుర్తించి సముచితంగా గౌరవించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశ లలో క్షేత్రస్థాయిలో ఉద్యమంలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి పారదర్శకంగా అర్హుల జాబితా తయారీకి తగు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Read Also: ఆటో డ్రైవర్గా మారిన ఐటీ ఉద్యోగిని.. వీడియో వైరల్!
Follow Us On : WhatsApp

