కలం, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy)తో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వం లో సీపీఎం బృందం సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పి. సుదర్శన్ ,జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి , సామినేని స్వరాజ్యం , ఎం. గోపాలరావు,రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కనీస వేతనాల సవరణ చట్టం తీసుకురావడం పైన సీపీఎం బృందం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
సీపీఎం నేతలతో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటున్నదని, రైతులు పండించిన పంటను కొనడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్ళు సక్రమంగా జరగడంలేదంటూ గొంతు చించుకుంటున్నవిపక్షాలు ఇప్పుడు ధర్నాలు చేయాల్సింది రాష్ట్రంలో కాదని, నిలదీయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదన్నారు. కేంద్రం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే ధాన్యం కొనుగోళ్ళకు చిక్కులు వచ్చాయన్నారు. పండి,చిన పంటలో 30% మాత్రమే కేంద్రం తీసుకుంటున్నదని, కానీ రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పంటను సొంత డబ్బులతో కొంటున్నదని, రైతుల ఖాతాల్లో మూడు రోజుల్లోనే జమ చేస్తున్నదని అన్నారు. సీపీఐ, సీపీఎం ప్రతినిధులతో సచివాలయంలో సోమవారం సమావేశమైన సందర్భంగా ధాన్యం కొనుగోళ్ళలోని సమస్యలను వివరించారు.
బెంగాల్ ఎన్నికలతో హమాలీల కొరత :
పంట కొనుగోలులోని సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని వామపక్ష సభ్యులకు సూచించారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లిన కార్మికులు, హమాలీలు చాలామంది ఇంకా తిరిగి రాలేదని, హమాలీల కొరత ఏర్పడి మిల్లులకు ధాన్యం సరఫరాలో, లోడింగ్-అన్‌లోడింగ్ చిక్కులు ఏర్పడ్డాయన్నారు. దీనికి తోడు ఈసారి సమ్మర్‌లో గరిష్ట స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయని, మధ్యాహ్నం సమయంలో పని జరగడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్ళపై నిరంతరం సమీక్షిస్తున్నామని గుర్తుచేశారు. మొక్కజొన్న పంటను కేంద్రం మద్దతు ధర ప్రకటించి సైలెంట్ అయిపోయిందని, కేంద్రం కొనుగోలు చేయడంలేదన్నారు. ఈసారి మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చిందని, మార్కెట్‌లో డిమాండ్ లేకపోయినా, ధర తక్కువగా ఉన్నా ఎంఎస్పీ రేటుకే రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నట్లు తెలిపారు.
మూసీ ప్రక్షాళనతో కాలుష్యం లేని జీవితం :
మూసీ నిర్వాసితులకు స్థానికంగానే నివాసాలను మంజూరు చేస్తామని సీఎం తెలిపారు. మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. మూసీని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం మూసీ కాలుష్య నదిగా మారిందని, నల్లగొండ జిల్లా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని గుర్తుచేశారు. “నగర ప్రజలకు క్వాలిటీ లైఫ్ ఇవ్వడమే నా ఉద్దేశం..” అని నొక్కిచెప్పారు. ప్రభుత్వ విద్యనూ ప్రక్షాళన చేస్తున్నామని, నాణ్యమైన విద్యతో పాటు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. కార్పొరేట్ స్కూల్‌కు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను నిర్వహిస్తున్నామని, ఆరుట్ల స్కూల్‌ను ఒకసారి సందర్శించాలని వారికి సూచించారు.

