Mobile Popup Ad
Mobile Popup Ad

వైభవ్ మరో వరల్డ్ రికార్డ్.. టీ20ల్లో అతడే నెం.1

కలం, వెబ్‌డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi ) రోజుకో రికార్డ్ బద్దలు కొడుతున్నాడు. బడాబడా ప్లేయర్లు అతి కష్టంతో చేసిన రికార్డులను ఈ బుడ్డోడు వెంటవెంటనే బద్దలు కొడుతూ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. శనివారం గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans) తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఒక సరికొత్త రికార్డ్‌ను సృష్టించాడు వైభవ్. ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ వేసిన మొదటి బంతినే సిక్సర్‌గా మలిచి టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా వైభవ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే 514 బంతుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో వైభవ్ 16 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ సిక్సర్లతో మరో రికార్డు కూడా ఆయన ఖాతాలో చేరింది. ఒక ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు (30) కొట్టిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డును వైభవ్ అధిగమించాడు. గతంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 40 లోపు బంతుల్లోనే రెండుసార్లు ఐపీఎల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా కూడా అతను ఇప్పటికే గుర్తింపు పొందాడు.

జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌ (Rajasthan Royals) తో జరిగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ తాత్కాలిక కెప్టెన్ యశస్వి జైస్వాల్ టాస్ గెలిచి గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా, ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఆరంభం నుంచే విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి ఓవర్లోనే 18 పరుగులు రావడంతో గుజరాత్ స్పీడ్ అందుకుంది.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 44 బంతుల్లో 84 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, సాయి సుదర్శన్ 36 బంతుల్లో 55 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 20 బంతుల్లో 37 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. తుషార్ దేశ్ పాండే వేసిన చివరి ఓవర్లో సుందర్, రాహుల్ తెవాటియా కలిసి 21 పరుగులు పిండుకోవడంతో గుజరాత్ స్కోరు 200 దాటింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>