కలం, వెబ్‌డెస్క్ : ప్రతి ఉద్యోగికి శాలరీ అకౌంట్ (Salary Accounts) ఉంటుంది. ఈ ఖాతాలో జీతం పడడం.. దానిని ఖర్చు చేయడం సాధారణం. అయితే, శాలరీ అకౌంట్ వల్ల కలిగే ప్రయోజనాలు, ఆఫర్ల గురించి చాలా మందికి తెలియదు. దీనికి కారణం బ్యాంకులు వాటిని వివరించకపోవడం. కానీ, ఈ ఆర్టికల్ లో శాలరీ అకౌంట్ వల్ల కలిగే బెనిఫిట్స్ తెలుసుకుందాం.
సాధారణంగా బ్యాంకులు చాలా రకాల ఖాతాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతుంది. అవసరాలకు అనుగుణంగా వాటిని ఖాతాదారులకు కేటాయిస్తుంది. అందులో సేవింగ్స్, శాలరీ, డిఫెన్స్ శాలరీ వంటి రకరకాల ఖాతాలు ఉన్నాయి. వీటిని కలిగి ఉండడం వల్ల చాలా సర్వీసులను మనం ఉచితంగా పొందవచ్చు. ముఖ్యంగా శాలరీ ఖాతాల (Salary Accounts)తో ఉండే బెనిఫిట్స్ ను చూద్దాం.
ప్రమాదవశాత్తు మరణించినా, ఆరోగ్య బీమ కవరేజ్ వంటి ప్రయోజనాలను శాలరీ అకౌంట్ ఉండడం ద్వారా పొందవచ్చు. ఇవి అదనపు ఆర్థిక భద్రతను అందిస్తాయి. అలాగే, పర్సనల్ లోన్ లేదా హౌసింగ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు.. శాలరీ ఖాతా ఉండడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుంది. బ్యాంకులు తరచుగా శాలరీ అకౌంట్స్ ఉన్నవారికి ప్రాధాన్యత వడ్డీ రేట్లను అందించడం వల్ల రుణాలు సరసమైనవిగా ఉంటాయి.
శాలరీ ఖాతాలు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. దీని వల్ల మీ అకౌంట్ బ్యాలెన్స్ జీరో ఉన్నా కూడా మనీ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది అత్యవసర సమయాల్లో దన్నుగా నిలుస్తుంది. చాలా బ్యాంకులు శాలరీ ఖాతాదారులకు ప్రాధాన్యతా సేవలను అందిస్తుంటాయి. వీటితో పాటు ఉచితంగా క్రెడిట్ కార్డులు, ఆఫర్స్ ఇస్తాయి. వీటిలో వార్షిక ఫీజు, రివార్డ్ పాయింట్లు ఉన్నాయి. శాలరీ అకౌంట్స్ ఉన్నవారికి తరచుగా డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, ఆన్ లైన్ షాపింగ్, డైనింగ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
బ్యాంకులు సాధారణంగా శాలరీ అకౌంట్స్ కు NEFT, RTGS వంటి డిజిటల్ సేవలు, చెక్ బుక్ లు, డెబిట్ కార్డు వంటి సర్వీసులు ఉచితంగా కల్పిస్తాయి. ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కూడా ఫ్రీగా అందుతాయి. ఎక్కువగా శాలరీ అకౌంట్లు ‘జీరో బ్యాలెన్స్’ ప్రయోజనం ఉండడంతో అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు.


