కలం డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అసలు బీజేపీ (Telangana BJP) ఉందా? అన్నట్టుగా పరిస్థితి ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అంత సీన్ ఏమీ కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడయ్యాక ఆ పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘోర పరాజయం అనంతరం బీజేపీ నేతల్లో కొంత అంతర్మథనం కనిపిస్తోంది. అందుకే ఏదో ఒక అంశం మీద హడావుడి చేస్తోంది. హిల్ట్ పాలసీపై ఇటీవల బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పాలసీ విషయంలోనూ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు విమర్శలు వచ్చాయి.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడం లేదన్నది ఆ పార్టీ ప్రధాన ఆరోపణ. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, మరికొందరు ముఖ్యనేతలు ఈ నిరసనలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల కుప్ప చేస్తే.. కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో పాలన కొనసాగిస్తోందని కిషన్ రెడ్డి మాట్లాడారు. మరి ఈ నిరసన ప్రదర్శనతోనైనా బీజేపీ సత్తా చాటుతుందా? అన్నది వేచి చూడాలి.
తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో ఐక్యత లోపించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిస్తే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలంతా ఒక్క వేదికమీదకు వస్తే అప్పుడు పార్టీలో ఊపు కనిపించేది. కానీ ఈ నిరసన ప్రదర్శనకు ఎంపీలంతా హాజరుకాలేదు.
మరోవైపు ఈటల రాజేందర్ తన మద్దతుదారులను సర్పంచ్‌లుగా గెలిపించుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా మారిపోయారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రస్తుతం కొంత గందరగోళంగానే ఉంది. తామే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసలైన ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితి ఏమీ కనిపంచడం లేదు. కేటీఆర్ నాయకత్వం విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు కనిపిస్తోంది. కవిత బయటకు వెళ్లిపోవడం.. జూబ్లీహిల్స్ లో ఓటమితో ఆ పార్టీ కుదేలవుతుంది. కేసీఆర్ కూడా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు.
ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి రాష్ట్రంలో బలపడే అవకాశం కనిపిస్తోంది. కానీ పార్టీలోని అంతర్గత విబేధాలు, పటిష్ఠ నాయకత్వం లేకపోవడం వంటి సమస్యలతో ఆ పార్టీ ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగడటం కూడా గందరగోళం సృష్టించింది. పాయల్ శంకర్ కాంగ్రెస్ గూటికి చేరుకుంటారేమోనన్న వార్తలు కూడా వినిపించాయి. మరి ఈ పరిస్థితిని తెలంగాణ బీజేపీ చక్కదిద్దుకోగలదా? అన్నది వేచి చూడాలి.
Read Also: 3 ట్రిలియన్ డాలర్లంటే ఎంతో తెలుసా?
Follow Us On: Pinterest


