కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ గ్లోబల్ సమ్మిట్ (Global Summit) ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నా, స్వయంగా ఢిల్లీ వెళ్ళి పలువురు కాంగ్రెస్ పెద్దలకు ఆహ్వానాలు అందజేసినా ఎవరూ రాకపోవచ్చనే సందేహాలు మొదలయ్యాయి. తెలంగాణకు చెందిన ఎంపీలు సైతం అటెండ్ అయ్యేది అనుమానమే. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మిట్ జరగనున్నది. కానీ ఆ రెండు రోజులు పార్లమెంటులో ‘వందేమాతరం’ గీతానికి 150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక చర్చ జరగనున్నది. ప్రధాని మోడీ ఈ చర్చను ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజున (డిసెంబరు 9) ఇంటెన్సివ్ సమ్మరీ రివిజన్ (SIR – ఓటర్ల జాబితా సవరణ) అంశంపై చర్చ జరగనున్నది. డిసెంబరు 8 నుంచి 10వ తేదీ వరకు కాంగ్రెస్ ఎంపీలంతా పార్లమెంటు సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలంటూ ఆ పార్టీ విప్ జారీ చేసింది. దీంతో రాష్ట్రానికి చెందిన ఎంపీలు సైతం గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావడం కష్టమే. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులందరికీ స్వయంగా సీఎం ఇన్విటేషన్లు ఇచ్చినా వారు రావడానికి అవకాశాలు లేవు. గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సోనియాగాంధీ వివరణ ఇస్తూ హాజరవుతున్న అతిథులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని, కేంద్ర మంత్రులూ డౌటే :
పార్లమెంటు సమావేశాల్లో కీలకమైన అంశాలమీద చర్చ జరుగుతున్నందున ప్రధాని, కేంద్ర మంత్రులు సైతం హాజరు కావడానికి అవకాశాల్లేవ్. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావచ్చనే ఆశలున్నా ఎంతమంది వస్తారనేది చివరి నిమిషం వరకూ అనుమానమే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని గ్లోబల్ సమ్మిట్(Global Summit)ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. రాబోయే 22 ఏండ్లలో రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే వ్యూహాన్ని తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ – 2047 పేరుతో దేశ, విదేశీ ప్రతినిధుల సమక్షంలో ఆవిష్కరిస్తున్నది. దాదాపు 110 పేజీలతో ఈ డాక్యుమెంట్ రూపొందింది. సెక్టార్లవారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, రెండేండ్లలో సాధించిన ప్రగతి రాబోయే పదేండ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ ఏ స్థాయికి అభివృద్ధి చెందుతుందో ఈ డాక్యుమెంట్‌లో ప్రభుత్వం వివరించనున్నది.
Read Also: ఫ్యూచర్ సిటీలో ‘వంతారా’ జూ పార్క్ !
Follow Us On: Pinterest


