కలం డెస్క్ : Hyderabad Billionaires | దేశంలో ఏటేటా బిలియనీర్ల సంఖ్య పెరుగుతున్నది. గతేడాదితో పోలిస్తే ఈసారి బిలియనీర్ల సంఖ్య పెరిగింది. ఒక బిలియన్ డాలర్ల (దాదాపు 8,800 కోట్ల రూపాయలు) సంపద ఉన్న వారు ఈ జాబితాలోకి చేరుతారు. ఆ ప్రకారం హైదరాబాద్ నగరం దేశంలోనే నాల్గవ సిటీగా (ముంబై, ఢిల్లీ, బెంగళూరు… మొదటి మూడు సిటీలు) గుర్తింపు పొందింది. దేశం మొత్తం మీద 350 మందికి పైగా బిలియనీర్లు ఉంటే 19 మంది హైదరాబాద్ నగరంలో ఉన్నారు.
ఇందులో దివీస్ ఫార్మా యజమాని మురళి రూ. 91 వేల కోట్లతో మొదటివాడిగా (హైదరాబాద్ నగరం జాబితాలో) ఉంటే, మెగా ఇంజినీరింగ్ సంస్థ వ్యవస్థాపకుడైన పిచ్చిరెడ్డి రూ. 42,650 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో, అదే కంపెనీకి చెందిన ఆయన కుమారుడు పీవీ కృష్ణారెడ్డి రూ. 41,140 కోట్లతో థర్డ్ ప్లేస్‌లో, హెటిరో డ్రగ్స్ యజమాని (బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడు) పార్ధసారధి రూ. 39,030 కోట్లతో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఈ నలుగురూ టాప్-100లో చోటు సంపాదించుకున్నారు. ఇందులో ఇద్దరు (మురళి, పార్ధసారధి) ఫార్మా రంగానికి చెందినవారు కాగా, తండ్రీ కొడుకులు (పిచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి) ఇంజినీరింగ్ రంగానికి చెందినవారు.
ఆరు రెట్లు పెరిగిన బిలియనీర్లు :
హరూన్ సంస్థ 13 ఏండ్ల క్రితం తొలిసారి బిలియనీర్ల జాబితా (2025 సంవత్సరానికి)ను ప్రచురించింది. ఆ గణాంకాలతో పోలిస్తే ఈసారి భారత్ బిలియనీర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. ఈసారి 350 మందికి పైగా (378 మంది) బిలియనీర్ల ఈ జాబితాలో ఉన్నారు. దీనికి తోడు ‘బిలియనీర్ల క్లబ్’లో చేరడానికి ముంబై నుంచి 451 మంది, ఢిల్లీ నుంచి 223 మంది, బెంగుళూరు నుంచి 116 మంది, హైదరాబాద్ నుంచి 102 మంది అర్హత సాధించారు. హరూన్ జాబితాలోని బిలియనీర్ల సంపదంతా కలిపి రూ. 167 లక్షల కోట్లు. ఇది మొత్తం దేశ జీడీపీలో దాదాపు సగం. సౌదీ అరేబియా డీజీపీకంటే ఎక్కువ. గతేడాది బిలియనీర్లతో పోలిస్తే ఈసారి 24 మంది కొత్తగా చేరినట్లు హరూన్ నివేదిక వెల్లడించింది.

