కలం డెస్క్ : Asia Cup | అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల్లో ఆసియా కప్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఆసియా దేశాల మధ్య జరిగే ఈ టీ20 టోర్నీ వ్యూయర్షిప్.. అంతర్జాతీయ టీ20 వరల్డ్ కప్ కి ఏమాత్రం తీసిపోదు. పోటీ పడేది ఆసియా దేశాలే అయినా.. ఈ టోర్నీని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంది. ఈ టోర్నీ స్టార్ట్ అయ్యి ఈ ఏడాదికి 41 సంవత్సరాలు. 41ఏళ్ల చరిత్రలో ఈ ఏడాది జరిగిన ఫైనల్ చాలా ప్రత్యేకం. అందుకు భారత్, పాకిస్థాన్.. ఫైనల్ లో తలపడటమే కారణం. ఆసియా కప్ హిస్టరీలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ రెండు జట్లు ఫైనల్స్ లో తలపడలేదు. అందుకే ఈ ఏడాది ఆసియా కప్ ఫైనల్స్ చాలా రసవత్తరంగా, ఉత్కంఠ భరితంగా మారింది. ఇందులో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పటి వరకు భారత్ సొంతం చేసుకున్న ఆసియా కప్ ట్రోఫీల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరి ఇంతకీ ఇప్పటి వరకు ఆసియా కప్ ను భారత్ ఏయే సంవత్సరాల్లో గెలుచుకుంది, ఆ టోర్నీల్లో భారత్ ప్రత్యర్థులు (రన్నరప్‌లు) ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆసియా కప్ తొలిసారి 1984లో జరిగింది. ఆ టోర్నీ ఫైనల్స్‌లో భారత్, శ్రీలంక తలపడ్డాయి. వీరి మ్యాచ్ కి యూఏఈ వేదికగా నిలిచింది. సునీల్ గవాస్కర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత్.. లంకను చిత్తుచేసి ఘన విజయం సాధించింది. దీంతో ఆసియా కప్ తొలి విజేతగా భారత్ నిలిచింది.
అప్పుడే కాదు.. ఆ తర్వాత 1988, 1990-91, 1995 ఆసియా కప్ టోర్నీల ఫైనల్స్‌లో కూడా భారత్, శ్రీలంక జట్లే తలపడ్డాయి. కానీ ప్రతిసారీ భారత్ లంకను చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. కానీ 1997లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో తన వరుస పరాజయాలకు శ్రీలంక ప్రతీకారం తీర్చుకుందనే చెప్పాలి. 1997 ఫైనల్స్‌లో భారత్‌ను 8వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అయితే ఇక్కడ శ్రీలంకకు బాగా కలిసి వచ్చిన అంశం ఒకటి ఉంది. అదేంటంటే టోర్నీ.. శ్రీలంకలో జరగడం. హోం గ్రౌండ్స్ కావడంతో ఆ టోర్నీలో శ్రీలంక వీరవిహారం చేసింది. ఆఖరికి భారత్ ను ఓడించి.. ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరో రెండుసార్లు 2004, 2008లో కూడా భారత్ ను శ్రీలంక ఓడించి.. తమ మధ్య గెలుపోటములను సమం చేసుకుంది.
2010లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో భారత్ మరోసారి తన సత్తా చాటుకుంది. ఆ ఏడాది కూడా ఫైనల్స్‌కు శ్రీలంక, భారత్ చేరుకున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 81 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.. తమ సత్తా చాటుకుంది.
ఆ తర్వాత 2016, 2018లో మాత్రం ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ తో బంగ్లాదేశ్ తలపడింది. 2016 టోర్నీ.. బంగ్లాదేశ్ లోనే జరిగినా భారత ఆటగాళ్ల ముందు బంగ్లాదేశీయులు నిలవలేకపోయారు. 2018లో యూఏఈ వేదికగా జరిగిన టోర్నీలో మాత్రం బంగ్లాదేశ్.. భారత్ కు కాస్తంత గట్టిపోటీ ఇచ్చిందనే చెప్పాలి. కానీ విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. టీమిండియా మరోసారి తామే ఛాంపియన్స్ అని నిరూపించుకుంది.
2023లో శ్రీలంక, భారత్ మధ్య జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో భారత్ వీరవిహారం చేసింది. ఈ 16వ ఆసియా కప్ ఫైనల్స్‌లో శ్రీలంకను ఇండియా 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తు చేసింది. ఆ తర్వాత మళ్లీ 2025లో దుబాయ్ వేదికగా పాకిస్థాన్, భారత్ తలపడ్డాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచి 5 వికెట్ల తేడాతో ఛాంపియన్స్‌గా నిలిచారు.

