కలం డెస్క్ : Tollywood | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) విదేశాల్లో నిర్మించే చిత్రాలపై 100% టారిఫ్ విధించడంతో టాలీవుడ్ పరిశ్రమకు ఊహించని దెబ్బ తగిలింది. భారీ ఖర్చుతో నిర్మిస్తున్న తెలుగు చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లోనూ విడుదలవుతున్నాయి. అమెరికాలోని తెలుగువారికీ వినోదాన్ని పంచుతున్నాయి. ట్రంప్ నిర్ణయంతో అక్కడి ఎగ్జిబిటర్లు, బయ్యర్ల (కొనుగోలుదారుల), డిస్ట్రిబ్యూటర్లపై రెట్టింపు ఆర్థిక భారం పడుతున్నది. అక్కడి ప్రభుత్వానికి టారిఫ్ రూపంలో డబుల్ టాక్స్ కట్టక తప్పదు. చివరకు ఇది థియేటర్ టికెట్ ధరలు పెరిగి సినీ ప్రేక్షకులపై భారం పడడానికి దారితీస్తున్నది. ఈ కారణంగా గణనీయమైన సంఖ్యలో టాలీవుడ్ చిత్రాల విడుదల ప్రశ్నార్థకం కానున్నది.
తక్కువ బడ్జెట్ చిత్రాలకు చిక్కులు :
భారీ బడ్జెట్‌తో తీసిన చిత్రాలు, ప్రముఖ దర్శకులు-నిర్మాతలు తీసే సినిమాలకు ఉండే ఆదరణకు అనుగుణంగా అక్కడి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎక్కువ ధర పెట్టి కొనడానికి వెనకాడకపోవచ్చు. ట్రంప్ విధించిన 100% టారిఫ్‌ను అక్కడి ప్రభుత్వానికి కట్టేందుకు సిద్ధపడొచ్చు. కానీ చిన్న, మధ్యస్థ బడ్జెట్‌తో తీసే చిత్రాలకు మాత్రం తిప్పలు తప్పవు. చిత్ర నిర్మాణానికి వెచ్చించే బడ్జెట్‌కు అనుగుణంగా నిర్మాతలు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. వసూళ్లు కూడా భారీ స్థాయిలో వస్తాయని అక్కడి బయ్యర్ల అంచనా. అందుకే ట్రంప్ టారిఫ్‌తో సంబంధం లేకుండా డబుల్ టాక్స్ కట్టేందుకు కూడా సిద్ధపడే అవకాశమున్నది. కానీ మిడిల్ బడ్జెట్ సినిమాలకే ఎక్కువ చిక్కులు వస్తాయి.
రికార్డు స్థాయిలో వసూళ్ళు :
భారీ బడ్జెట్‌తో నిర్మించిన బాహుబలి చిత్రానికి 22 మిలియన్ డాలర్లు అక్కడి థియేటర్ల ద్వారా వసూలయ్యాయి. కల్కి 2898 సినిమాకు 19 మిలియన్ డాలర్లు, ట్రిపుల్ ఆర్ చిత్రానికి 16 మిలియన్ డాలర్లు, పుష్ప-2 చిత్రానికి 15 మిలియన్ డాలర్ల చొప్పున వసూలైనట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. గతేడాది లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటే హిందీ, తమిళం, తెలుగు సినిమాల ప్రదర్శన ద్వారా సుమారు 170 మిలియన్ డాలర్లు వసూలయ్యాయి. ఇందులో దాదాపు పావు వంతు తెలుగు సినిమాలదే. అంటే, దాదాపురూ. 370 కోట్ల మేర తెలుగు సినిమాల ద్వారా వసూలయ్యాయి. అమెరికాలో తెలుగు సినిమాలకు అంతటి ఆదరణ ఉన్నది.
హెచ్-1 బీ భారానికి అదనం :
ఇప్పటికే హెచ్-1 బీ కొత్త అప్లికేషన్లకు లక్ష డాలర్ల ఫీజు విధించిన ట్రంప్ ఊహించని దెబ్బ కొట్టారు. ఇప్పుడు తెలుగు సినిమాలపై (విదేశాల్లో నిర్మించినవనే పేరుతో)నా 100% టారిఫ్ రూపంలో షాక్ ఇచ్చారు. అమెరికాలోని వివిధ ప్రావిన్సులలో (స్టేట్స్)ని దాదాపు 700 థియేటర్లలో తెలుగు సహా హిందీ, తమిళం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో కలిపి దాదాపు 12 లక్షల మంది తెలుగువారు నివసిస్తున్నారు. ఆ దేశంలో అతి ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉన్నది. కొన్ని గణాంకాల ప్రకారం కాలిఫోర్నియాలో 2 లక్షల మంది, టెక్సాస్‌లో లక్షన్నర మంది, న్యూజెర్సీలో లక్ష మందికి పైగా ఉంటున్నట్లు అంచనా. వీటికి తోడు ఇల్లినాయిస్, వర్జీనియా, జార్జియా, ఫ్లోరిడా తదితర చోట్ల కూడా తెలుగు జనాభా వేలల్లోనే ఉంటున్నది.
టారిఫ్‌తో పెరగనున్న టికెట్ ధరలు :
ట్రంప్ విధించిన టారిఫ్‌తో అక్కడి థియేటర్ల యాజమాన్యం ఆ దేశ ప్రభుత్వానికి ఇప్పుడు కడుతున్న పన్నులకు డబుల్ కట్టాల్సి ఉంటుంది. టికెట్ ధరలను పెంచకుండా ఇది సాధ్యం కాదు. టికెట్ ధరలు పెంచితే థియేటర్లకు వచ్చే తెలుగు ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుందేమోననే గుబులు తప్పదు. ఒకవైపు ఉద్యోగాల్లో కోత, మరోవైపు హెచ్-1 బీ వీసా రుసుము పెంపుతో సతమతమయ్యే సమయంలో థియేటర్ టికెట్ ధరను దాదాపు డబుల్ రేటుకు కొనడం సాధ్యమేనా అనే చర్చ మొదలైంది. దీంతో కొత్త చిత్రాల వసూళ్ళు బాగా తగ్గిపోతాయి. టోలీవుడ్ పరిశ్రమకు నష్టం వాటిల్లే అవకాశముంది. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే ప్రమాదమున్నది. ఈ ఆల్టర్నేట్ ప్లాట్‌ఫామ్‌కు ఆదరణ పెరిగితే ట్రంప్ వీటి మీద కూడా టారిఫ్ విధిస్తారేమో అనే సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.
టాలీవుడ్‌పై ప్రతికూల ప్రభావం :
ట్రంప్ టారిఫ్ నిర్ణయంతో అమెరికాలోని థియేటర్లలో విడుదలయ్యే సినిమాల సంఖ్య తగ్గిపోతుంది. ఈ చిత్రాలను నిర్మించిన నిర్మాతలకు వసూళ్ళు తగ్గుతాయి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమకు ఆదరణ తగ్గిపోయే అవకాశమున్నది.

