కేరళ(Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. సీఎం వ్యక్తిగత కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్‌కు కూడా నోటీసులు అందినట్లు సమాచారం. 2019లో కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు (కేఐఐఎఫ్‌బీ) ద్వారా “మసాలా బాండ్స్” పేరుతో అంతర్జాతీయ మార్కెట్‌లో నిధుల సేకరణ జరిగింది. ఈ బాండ్‌లు విడుదల చేసే ప్రక్రియలో విదేశీ మారకపు నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలు పాటించలేదని అభియోగాలు ఉన్నాయి. వివిధ కీలక ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది.
ఈ వ్యవహారంలో అప్పటి ఆర్థిక శాఖ నిర్ణయాలు, కేఐఐఎఫ్‌బీ తరఫున కేంద్రానికి ఇచ్చిన సమాచారం, ఆర్థిక అనుమతుల విధానం తదితర అంశాలపై ఈడీ ఇప్పటికే పలు దఫాలు విచారణ చేపట్టింది. ఇప్పుడు ఈ వ్యవహారం మరింత క్లిష్ట దశకు చేరడంతో, ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈడీ, ముఖ్యమంత్రి కార్యదర్శి, మాజీ మంత్రి థామస్ ఐజాక్(Thomas Isaac)కి నోటీసులు జారీ చేసింది. బాండ్ల జారీకి సంబంధించిన నిర్ణయం ఎవరు తీసుకున్నారు? కేంద్ర అనుమతులు ఉన్నాయా? అంశాలపై వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. కేంద్రం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని కక్ష సాధిస్తోందని ముఖ్యమంత్రి పినరయి(Pinarayi Vijayan) వర్గీయులు ఆరోపిస్తున్నారు. తాము ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించలేదని చెబుతున్నారు. చట్టపరంగా నోటీసులను ఎదుర్కొంటామని అంటున్నారు.
Read Also: ఆక్షన్ లో సర్పంచ్ పదవి.. ఎంతంటే..?
Follow Us On: X(Twitter)


