epaper
Thursday, March 5, 2026
epaper

హుజూర్‌నగర్‌లో బట్టబయలైన భారీ ల్యాండ్ స్కామ్

కలం, నల్లగొండ బ్యూరో : హుజూర్‌నగర్ నియోజకవర్గంలో భారీ మైనింగ్ స్కామ్ (Huzurnagar Mining Scam) బయటపడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1100 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ మైనింగ్ కనుసన్నల్లోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని డెక్కన్ సిమెంట్స్, నాగార్జున సిమెంట్స్‌కు 1100 ఎకరాల ఫారెస్ట్ భూమిని ధారదత్తం చేయడం వెనుక పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్‌శాఖ ఆగస్టు 30, 2024న ఈ-వేలం నిర్వహించగా, డెక్కన్ సిమెంట్స్, నాగార్జున సిమెంట్స్ వంటి సంస్థలు ఈ వేలంలో పాల్గొని బ్లాక్‌లను దక్కించుకున్నాయి. గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై జరిమానాలు విధించినా మళ్లీ అవే సంస్థలకు కేటాయింపులు జరగడం గమనార్హం.

వాస్తవానికి రిజర్వు ఫారెస్ట్ భూముల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ల్యాండ్‌ను మైనింగ్ కోసం కేటాయించాల్సి వస్తే.. దానికి పెద్ద తంతు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మొదటగా ఆ ఫారెస్ట్ ల్యాండ్‌ను ‘డీ- నోటిఫై’ చేయాల్సి ఉంటుంది. పర్యావరణ అనుమతులు దగ్గరి నుంచి అనుమతులు తీసుకోవడం తదితర ప్రక్రియ ఉంటుంది. ఇదిలావుంటే.. ఈ అక్రమ కేటాయింపులు, అధికారుల నిర్లక్ష్యంపై దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు.. హుజూర్‌నగర్ ఆర్డీఓ, మఠంపల్లి తహసీల్దార్ సహా పలువురు ఉన్నతాధికారులకు గతంలోనే నోటీసులు జారీ చేసింది. కాగా, మార్చి 2, 2026న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు నియమిత కమిటీ (సీఈసీ) కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. అటవీ భూముల్లో అక్రమ మైనింగ్‌కు సంబంధించి అధికారుల నిర్లక్ష్యంపై నివేదికలు కోరినట్లు సమాచారం.

మూడు కీలక బ్లాక్‌ల్లో కేటాయింపులు..

డెక్కన్ సిమెంట్స్, నాగార్జున సిమెంట్స్‌కు మఠంపల్లి మండల పరిధిలోని మూడు కీలక బ్లాక్‌ల్లో భూకేటాయింపులు జరిగాయి. సైదుల్ నామా బ్లాక్ పరిధిలో 500 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని రెవెన్యూ భూమిగా చూపించి కేటాయింపులు చేసినట్టు సమాచారం. సుల్తాన్‌పూర్ బ్లాక్ పరిధిలో 400 ఎకరాల అటవీ భూమిని ఎలాంటి ఎన్ఓసీ లేకుండానే వేలం వేశారు. పసుపులబోడు పరిధిలోని 200 ఎకరాల భూమి విషయంలో హద్దుల గుర్తింపులో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయి.

ఇప్పటికే ఈ భూమిలో గిరిజనులు పంటలు సాగు చేసుకుంటుండడం గమనార్హం. మొత్తం మీద 1100 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్‌ను నిబంధనలను తుంగలొకి తొక్కి సిమెంట్స్ కంపెనీలకు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జరిగిన అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఇప్పటికే డెక్కన్ సిమెంట్స్ వంటి సంస్థలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వద్ద విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికితోడు మార్చి 2, 2026న జరిగిన విచారణలో, అటవీ భూమిని కొనుగోలు చేసినట్లు ఆధారాలు చూపాలని డెక్కన్ సిమెంట్స్ సంస్థను సీఈసీ ఆదేశించడం కొసమెరుపు.

అధికారుల పాత్రపైనా అనుమానాలు..

1100 ఎకరాల భూమి కేటాయింపు విషయంలో రెవెన్యూ అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి సరిహద్దులు గుర్తించకుండానే, కంపెనీలకు అనుకూలంగా నివేదికలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అటవీ భూమిని మైనింగ్ బ్లాక్‌గా మార్చాలంటే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతితో ‘డీ-నోటిఫికేషన్’ ప్రక్రియ జరగాలి. కానీ అధికారులు ఈ ప్రక్రియను దాటవేసి, నేరుగా మైనింగ్ శాఖకు క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

జీపీఎస్ రీడింగ్స్ (లాటిట్యూడ్, లాంగిట్యూడ్) మార్చి అటవీ భూమిని రెవెన్యూ భూమిగా రికార్డుల్లో చూపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ బ్లాక్‌లకు (Huzurnagar Mining Scam) సంబంధించిన సరిహద్దులను గుర్తించడంలో డీజీఎన్ఎస్ఎస్ సర్వే నిర్వహించలేదని, దీనివల్ల రిజర్వ్ ఫారెస్ట్ భూమి మైనింగ్ పరిధిలోకి చేరిందని ఆరోపణలూ ఉన్నాయి. మొత్తానికి డెక్కన్ సిమెంట్స్, నాగార్జున సిమెంట్స్ ఫారెస్ట్ భూములను వేలంలో దక్కించుకున్నప్పటికీ.. పర్యావరణ అనుమతుల విషయంలో వ్యవహారం బెడిసికొట్టింది. దీంతో ఈ టెండర్లను రద్దు చేయాలనే డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి.

Read Also: గణపతి లొంగుబాటు వేళ ఆడియో వైరల్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!