కలం, నిజామాబాద్ బ్యూరో: అది మూడు రాష్ట్రాల సరిహద్దులోని తెలుగు గ్రామం(Hunsa Village).. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ఉంది.. పేరు హున్సా. గ్రామంలో బుధవారం హోళీ పండుగ. ఊరంతా బంధువులు, చుట్టాలు.. పిండి వంటలు, కొత్త బట్టలతో కళకళలాడుతోంది. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఉదయం నుంచి ఒకటే సందడి. ఇంతలో సాయంత్రం అయ్యింది. అంతే, ఊళ్లోని వాళ్లంతా ఒకచోటుకు తరలివచ్చారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. కాసేపటికి ఆపేశారు. ఇంతకీ.. వీళ్లు ఎందుకు ఇలా పిడిగుద్దులతో కొట్టుకున్నారు అనుకుంటున్నారా? ఇది ఆచారం.
ఆచారం వెనక కథేంటంటే..
ప్రతి హోళీ పండుగ రోజు తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకలకు సరిహద్దులోని హున్సాలో(Hunsa Village) జరిగే ఈ వింత ఆచారం చూడడానికి కూతుళ్ళు, అల్లుళ్ళు, స్నేహితులు, పొరుగూళ్ల నుంచి జనాలు పెద్ద ఎత్తున తరలివస్తారు. పండగ రోజు ఉదయం నుంచి ఊరంతా హోళీ సంబరాల్లో మునిగి తెలుతారు. సాయంత్రం అయి, చీకటి పడుతుండగా ప్రధాన కూడలి అయిన హనుమాన్ ఆలయం వద్దకు చేరుకుంటారు.
గ్రామస్తులు మొత్తం రెండు వైపులా నిలబడతారు. అప్పటికే రెండు వైపులా పొడవాటి తాడు కడతారు. ఊరికి నలువైపులా పూజలు చేసి డప్పు వాయిద్యాల నడుమ గ్రామ పెద్దలు, యువకులు, జనాలు అక్కడికి చేరుకుంటారు. చిన్న,పెద్ద తేడా లేకుండా రెండు వైపులా తాడు పట్టుకొని నిలబడతారు. అంతా సిద్ధం అయ్యాక గ్రామ పెద్దలు సై అనగానే, జనాలు ఒకరినొకరు పరస్పరం కొట్టుకుంటారు. దాదాపు ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలా సాగుతుంది. ఆ తర్వాత అందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇలా చేయడం ఇక్కడ దశాబ్దాలుగా ఆనవాయితీ. పాడి పంటలతో ఊరంతా పచ్చగా ఉండాలని, గ్రామానికి ఏ కీడూ సోకకూడదని, ఏడాదంతా అంటు వ్యాధులు రావొద్దని, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వేడుక నిర్వహిస్తారు.
దీనికి ముందు సమీపంలోని పొలాల్లో కుస్తీ పోటీలు కూడా జరుగుతాయి. అందులో తెలంగాణ, మహారాష్ట్ర కర్నాటక నుంచి కుస్తీ వీరులు ప్రత్యేకంగా వచ్చి పాల్గొంటారు. ఈ సందర్బంగా గ్రామంలో జాతర కూడా జరుగుతుంది. బొమ్మలు, గాజులు, అన్ని రకాల వస్తువులు ఈ జాతరలో లభిస్తాయి.

