కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026లో న్యూజిలాండ్(New Zealand) ఫైనల్‌కు చేరింది. బుధవారం సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. మార్కో యాన్సన్(55 నాటౌట్; 30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా, డెవాల్డ్ బ్రెవిస్(34; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్(29; 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఓ మోస్తరు పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, కోల్ మెకెంచీ, రచిన్ రవీంద్ర తలో 2 వికెట్లు తీశారు. జేమ్స్ నీషమ్, ఫెర్గూసన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో కివీస్(New Zealand) అదరగొట్టింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (100 నాటౌట్; 33 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో వీరవిహారం చేశాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలోనే అత్యంత వేగవంతమైన శతకంతో రికార్డు సృష్టించాడు. మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్(58; 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆట ఆడుకుంటూ వీళ్లిద్దరూ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు. మొదటి వికెట్‌కు 9.1ఓవర్లలో ఏకంగా 117 పరుగులు జోడించారు. అనంతరం స్టీఫర్ట్ను రబడ ఔట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అయితే, అప్పటికే కివీస్ విజయం ఖాయమైంది. రచిన్ రవీంద్ర (13 నాటౌట్; 11 బంతుల్లో 2 ఫోర్లు) మిగిలిన లాంఛనాన్ని అలెన్ పూర్తి చేశాడు. న్యూజిలాండ్ జట్టు 12.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించడం విశేషం. సెంచరీతో వీరుడు అలెన్ ఫిన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. రేపు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో కివీస్ ఆడుతుంది.

