కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్(Babar Azam)కు భారీ షాక్ తగిలింది. టీ20 వరల్డ్ కప్ ముందు బంగ్లాదేశ్ వివాదం నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్ అయిన తర్వాత బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లాలని పాక్ నిర్ణయించుకుంది. కాగా వరల్డ్ కప్ నుంచి పాక్ ఇంటిబాట పట్టడంతో తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌పై ఫోకస్ పెట్టింది. కాగా ఈ టూర్‌కు వెళ్లే జట్టులో బాబర్(Babar Azam)కు స్థానం కల్పించలేదు. తాజాగా ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టు నుండి స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను తప్పించారు. ఈ సిరీస్ మార్చి 11 నుండి 15 వరకు ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగనుంది.
ఈ పర్యటనకు పేసర్ షాహీన్ షా అఫ్రిది కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. జట్టులో భారీ మార్పులు చేస్తూ పీసీబీ ఏకంగా ఆరుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. అబ్దుల్ సమద్, మాజ్ సదాకత్, మహమ్మద్ ఘాజీ ఘోరీ, సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, షామిల్ హుస్సేన్‌లు తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికయ్యారు. వీరిలో అబ్దుల్ సమద్, మాజ్ సదాకత్, సాద్ మసూద్ , షామిల్ హుస్సేన్‌లకు అబుదాబిలో ఇంగ్లాండ్ లయన్స్‌తో ఆడిన అనుభవం ఉంది.
షెడ్యూల్ ప్రకారం, పాక్ జట్టు మార్చి 8న బంగ్లాదేశ్ చేరుకుంటుంది. మార్చి 10న ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని, మార్చి 11న తొలి వన్డే బరిలోకి దిగుతుంది. మార్చి 13 , 15 తేదీలలో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. అనుభవజ్ఞులైన రిజ్వాన్, హారిస్ రౌఫ్, సల్మాన్ అలీ ఆఘాలతో పాటు కుర్రాళ్లతో కూడిన ఈ జట్టు ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకమైన సవాలుగా మారనుంది.
పాక్ జట్టు:
షాహీన్ షా అఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్రమ్, హారిస్ రౌఫ్, హుస్సేన్ తలత్, మాజ్ సదాకత్, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ వసీం జూనియర్, మహమ్మద్ ఘాజీ ఘోరీ, సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ ఆఘా, షామిల్ హుస్సేన్.

