కలం, డెస్క్ : అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రతి నెలలో 10 రోజులు గ్రామాల్లో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth) ఆదేశించారు. తాజాగా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ (Revanth) మాట్లాడుతూ.. కలెక్టర్లు ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే గుర్తింపు పొందుతారని సీఎం రేవంత్ అన్నారు. ‘క్షేత్ర స్థాయిలో పర్యటించకపోతే మీకు ప్రజల సమస్యలు అర్థం కావు. కాబట్టి ఇక నుంచి 10 రోజులైనా గ్రామాల్లో తిరగండి. మార్చి 6 నుంచి జూన్ 12 దాకా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలి. అన్ని సంక్షేమ పథకాలను గ్రామ సభల్లో ప్రజలకు వివరించాలి’ అంటూ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇక నుంచి ప్రతి స్కూల్ లో మధ్యాహ్న భోజనానికి ఒక అధికారిని నియమించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ‘ఆ అధికారి స్టూడెంట్లతోనే మధ్యాహ్నం భోజనం చేయాలి. కలెక్టర్లు ప్రతి వారం ఒక్కో స్కూల్ లో మధ్యాహ్న భోజనం చేయాలి. ఇంకోసారి ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి మండల కేంద్రంలో నర్సరీ నుంచి 12 దాకా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. ఆరుట్ల తరహాలో అన్ని వసతులతో స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. భవిష్యత్ లో అన్ని మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఇంటిగ్రేట్ చేస్తాం. బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి’ అంటూ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
సస్పెండ్ చేస్తాం..
మిల్లర్ల దగ్గరి నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టే బాధ్యత కలెక్టర్లే తీసుకోవాలని సీఎం రేవంత్ వెల్లడించారు. మోసాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘ఇసుక, మైనింగ్ మాఫియా పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఎస్పీ, కలెక్టర్లను సస్పెండ్ చేస్తాం. ఈ ప్రభుత్వం కలెక్టర్లను నిశితంగా గమనిస్తోంది. మంచి పనులు చేస్తే అభినందిస్తాం. వార్షిక పర్ఫార్మెన్స్ ఆధారంగా అందరి పనితీరును తెలుసుకుంటాం. జూన్ లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి మీటింగ్ నిర్వహిస్తాం’ అని సీఎం రేవంత్ వెల్లడించారు.

