epaper
Tuesday, March 3, 2026
epaper

నగరం నడిబొడ్డున కాంగ్రెస్ ఎంపీ భార్యకు సర్కారు జాగ.. టార్గెట్ అయిన సీఎం

కలం, తెలంగాణ బ్యూరో : నగరం నడిబొడ్డున సర్కారు స్థలాన్ని ఓ ప్రజాప్రతినిధి కుటుంబానికి అప్పజెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) స్టాండింగ్ కమిటీ జనవరి 29న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం రాజకీయ చర్చకు దారితీసింది. హైదర్‌గూడలోని కేఫ్ బహార్ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని అప్పజెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఎన్ఓసీ (NOC) జారీ చేయడానికి ఈ సమావేశం తీర్మానం (Resolution No. 253) చేసింది. నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భార్య డాక్టర్ మల్లు రాజా బన్సీదేవి (Mallu Ravi Wife Raja Bansi Devi) పేరు మీద అలాట్ చేయడానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 8 కోట్ల విలువైన 233.73 చదరపు గజాల స్థలాన్ని అప్పగించేందుకు కమిటీ అప్రూవల్ ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2012 సెప్టెంబరులో రెవెన్యూ శాఖ జారీచేసిన జీవో (నెం. 571) ప్రకారం ఈ స్థలాన్ని అప్పగించాలన్న ప్రతిపాదనపై చర్చ అనంతరం ఎన్ఓసీ ఇచ్చేందుకు రూపొందిన తీర్మానానికి ఆమోదం తెలిపింది.

ప్రభుత్వం దగ్గర భూముల్లేవ్ -సీఎం రేవంత్‌రెడ్డి

ప్రభుత్వం దగ్గర భూములేవీ మిగల్లేద్దని, ఇద్దామన్నా ఇవ్వడానికి లేవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా నగరంలోని బంజారా భవన్‌లో గత నెల 15న స్పష్టం చేశారు. “ప్రభుత్వం భూములు ఇచ్చే కాలం పోయింది.. ఆ శకం ముగిసింది.. ప్రభుత్వం నుంచి భూములు ఆశించే ఆలోచనను మానుకోవాలి.. ఒకప్పుడు ఇందిరాగాంధీ అగ్రికల్చరల్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి జాగీర్‌దార్లు, భూస్వాముల దగ్గర ఉన్న భూముల్ని తీసుకుని పేదలకు అసైన్‌మెంట్ పట్టా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పంచిపెట్టింది… ఆ కాలంలో అది సాధ్యమైంది.. ఇప్పుడు సాధ్యం కాదు… ఇప్పటికే దాదాపు 25 లక్షల ఎకరాలను ప్రభుత్వాలు పంచిపెట్టాయి. ఇప్పుడు పంచుదామన్నా ప్రభుత్వం దగ్గర భూములు మిగల్లేదు.. భూముల గురించి ఆలోచన చేయకుండా సంక్షేమం గురించి ఆలోచించాలి…” అని సీఎం ఆ సభలో కామెంట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ తీర్మానం మేరకు ప్రభుత్వ రెవెన్యూ విభాగం ఆ స్థలాన్ని ఇస్తుందా? తిరస్కరిస్తుందా? అనేది కీలకం.

జీహెచ్ఎంసీ తీర్మానంతో పొలిటికల్ డిబేట్ :

మల్లు రవి భార్య (Mallu Ravi Wife) పేరు మీద 233.73 చ.గజాల స్థలాన్ని ఇవ్వడానికి జీహెచ్ఎంసీ తీర్మానం చేయడం ఇప్పుడు విపక్షాలకు అస్త్రంగా మారింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన లేదని, భూముల వ్యాపారమే జరుగుతున్నదని కేటీఆర్ తరచూ చేస్తున్న కామెంట్లకు ఇప్పుడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానం అదనంగా కలిసొచ్చినట్లయింది. ఈ భూమి అప్పగింతకు సంబంధించిన లీగల్ వ్యవహారం ఏమున్నప్పటికీ కాంగ్రెస్ ఎంపీ భార్య కావడంతో ధారాదత్తం చేసిందన్న కామెంట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. పేదల విషయంలో నిర్దయగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం సొంత పార్టీ పెద్దల విషయంలో బంధుప్రీతితో వ్యవహరిస్తున్నదనే విమర్శలకు జీహెచ్ఎంసీ తీర్మానం కారణమవుతున్నది. ప్రభుత్వ భూములను పబ్లిక్ అవసరాలకు ఇవ్వడానికి బదులుగా వ్యక్తులకు కట్టబెట్టడాన్ని ప్రతిపక్ష పార్టీ తప్పుపడుతున్నది.

Read Also: మరికాసేపట్లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన..?

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!