epaper
Monday, March 2, 2026
epaper

వరిపొలాలు ఎండుతున్నయ్.. కరెంట్ సరిపోతలే, కాల్వ నీళ్లు రాట్లే!

కలం, నల్లగొండ బ్యూరో : యాసంగి సీజన్ ఊపందుకుంది. వరినాట్లు కంప్లీట్ అయ్యి నెల రోజులు దాటుతోంది. కొన్ని పొలాలు ఇప్పటికే పొట్ట దశకు వస్తున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ కోతలు (Power Cuts) అన్నదాతను ముప్పుతిప్పలు పెడుతోంది. ఓవైపు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సర్కార్ చెబుతోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో 9 గంటల మించి ఉండటం లేదు. దీంతో పొట్టదశలో వరిపొలాలు ఎండిపోతున్నాయి. పొలాలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొంతమంది ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పోస్తుండగా, మరికొంతమంది కాల్వల్లో మోటార్లు పెట్టి రాత్రింబవళ్లు పంట పొలాలకు నీరు పారించేందుకు జాగారం చేస్తుండడం గమనార్హం. పాలకుల పరిహాసమో.. అధికారుల నిర్లక్ష్యమో గానీ.. నాణ్యమైన విద్యుత్ వ్యవసాయానికి అందడం లేదనేది అక్షర సత్యం. ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు చొరవ చూపితేగానీ యాసంగి సీజన్ గట్టెక్కే పరిస్థితి లేకపోవడం గమనార్హం.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇదీ పరిస్థితి

ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో వ్యవసాయ పంటల సాగుకోసం ప్రధానంగా భూగర్భ జలాలపైనే ఆధారపడుతుంటారు. కాల్వ నీటితో సాగు చేయడం చాలా తక్కువ. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయ మోటార్లు కనెక్షన్లు దాదాపు 4.5 లక్షల వరకు ఉన్నాయి. ఒక్క నల్లగొండ జిల్లాలోనే దాదాపు 2.37 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండడం గమనార్హం. తెలంగాణలో అత్యధికంగా బావులు, బోరు బావుల ద్వారా సాగు జరిగే జిల్లాల్లో ఉమ్మడి నల్లగొండ ఒకటి. ఇదిలావుంటే.. ఎండల తీవ్రత పెరగడంతో పంట పొలాలకు నీటి వినియోగం పెరిగింది. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో లోడ్ ఎక్కువవుతోంది. దీంతో లోఓల్టేజీ సమస్య ఏర్పడుతోంది. ఫలితంగా ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ రిపేర్ కావడం.. బోరు మోటార్లు సైతం కాలిపోతున్నాయి. దీంతో అన్నదాతలపై అదనపు భారం పడుతోంది.

అధికారుల తీరుపై అన్నదాతల అసంతృప్తి

ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో అన్నదాతల పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే మారింది. ఓవైపు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా నేటికీ యూరియా పూర్తిస్థాయిలో అందడం లేదు. దీనికితోడు విద్యుత్ కోతల సమస్యగా మారింది. పానగల్ రిజర్వాయర్‌లో సాగునీటి అవసరాల మేర నీరు లభ్యత ఉన్నప్పటికీ అధికారులు నీటిని విడుదల చేసేందుకు ససేమిరా అంటుండడం గమనార్హం. ఇటీవల నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలానికి చెందిన అన్నదాతలు విద్యుత్ కోతలతో విసిగిపోయారు. తరచూ లోఓల్టేజీ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే సాగునీటి కోసం కాల్వలకు నీటిని విడుదల చేయాలని అధికారులను సంప్రదించారు. కానీ ఇరిగేషన్ శాఖ అధికారుల తీరుతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ‘మమ్మల్ని అడిగి పంటలు వేశారా? మీ పంటల కోసం మేం సాగునీటిని విడుదల చేయాలా..? అంటూ కఠినంగా సమాధానం చెప్పడంతో స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. వారు జోక్యం చేసుకోవడంతో కొంతమేర పరిస్థితి చక్కబడింది. కానీ మళ్లీ వారం రోజులకే కాల్వ నీళ్లు బంద్ అయ్యాయి. యూరియా పంపిణీ, నీటి విడుదల, విద్యుత్ సరఫరా.. శాఖ ఏదైనా రైతాంగం పట్ల కొంత బాధ్యతతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ అవసరమే.

Read Also: సీఎం వర్సెస్ సివిల్ సర్వెంట్స్.. ఆగ్రహం, అనుగ్రహం ఎవరిపై?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!