కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూ ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో తెలంగాణ ప్రభుత్వం 24×7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకుపోయిన తెలంగాణ పౌరులు, అలాగే వారి కుటుంబసభ్యుల నుంచి వస్తున్న అభ్యర్థలను దృష్టిలో ఉంచుకుని 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
అత్యవసర పరిస్థితులు, ప్రయాణ అంతరాయాలు లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. న్యూ ఢిల్లీలోని తెలంగాణభవన్ సీనియర్ అధికారులు విదేశాంగ మంత్రిత్వశాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. మధ్యప్రాచ్య ప్రాంత పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే కింది నంబర్లను కాంటాక్ట్ అవ్వొచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు
వందన బరువా, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్ – +91 9871999044
సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – +91 9958322143
జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్ – 9910014749
రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ – +91 9643723157

