కలం, నల్లగొండ బ్యూరో : హైదరాబాద్‌లోని నార్ముల్ (Narmul) మదర్ డెయిరీ ఎదుర్కొంటున్న ఆర్థిక, పరిపాలనాపరమైన సమస్యలను పరిష్కరించి, సంస్థను మళ్లీ లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) చైర్మన్ డాక్టర్ మీనేష్ సి.షా (Meenesh C Shah) రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నార్ముల్ డెయిరీ యూనియన్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని ప్రతినిధులు సమగ్రంగా పరిశీలించారు. బ్యాంకులకు ఉన్న బకాయిలు, పాల ఉత్పత్తిదారులైన రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ నిధులను వెంటనే క్లియర్ చేయడం, నిలిచిపోయిన డెయిరీ కార్యకలాపాలను వేగవంతం చేయడం, సంస్థ పరిపాలనలో పారదర్శకతను పెంచి, దీర్ఘకాలిక స్థిరత్వం కోసం సంస్కరణలు చేపట్టాలనే నిర్ణయాలు తీసుకున్నారు.
డెయిరీ యూనియన్‌ను ఆరోగ్యకరమైన, స్థిరమైన దిశగా తీసుకెళ్లేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందించాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరగా, ఎన్‌డీడీబీ చైర్మన్ డాక్టర్ మీనేష్ సి. షా(Meenesh C Shah) సానుకూలంగా స్పందించారు. నార్ముల్ డెయిరీ పునరుద్ధరణకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) మాట్లాడుతూ.. సహకార డెయిరీ రంగాన్ని బలోపేతం చేస్తూ, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాబోయే వారాల్లో ఎన్‌డీడీబీ సూచించిన వ్యూహాత్మక ప్రతిపాదనలపై సంయుక్తంగా పని చేసి, నార్ముల్ డెయిరీకి పూర్వవైభవం తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ జి.మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

