కలం, డెస్క్ : ప్రపంచ స్థాయి టోర్నమెంట్ లు ఇప్పుడు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. తాజాగా మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కు హైదరాబాద్ వేదిక కాబోతోంది. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 టోర్నమెంట్ ఇప్పుడు భాగ్యనగరంలో జరగబోతోంది. Fédération Internationale de Hockey (FIH) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది.
మార్చి 8 నుంచి 14వ తేదీ దాకా గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన హాకీ స్టేడియంలో జరుగుతాయి. 2026 మహిళల హాకీ వరల్డ్ కప్ కు అర్హత సాధించేందుకు జట్లకు ఈ టోర్నమెంట్ కీలకపాత్ర పోషిస్తుంది. హాకీ ఇండియా, Fédération Internationale de Hockey ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ఈ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వరల్డ్ క్లాస్ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్లేయర్లు, ఇతర ప్రతినిధులు, అధికారుల కోసం ప్రీమియం వసతిని ఏర్పాటు చేస్తున్నారు.
8 జట్లు పోరుకు రెడీ..
ఈ క్వాలిఫయర్స్‌లో టోర్నమెంట్ లో మొత్తం 8 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు ఆడబోతున్నాయి. భారత్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉరుగ్వే జట్లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నాయి.
తెలంగాణ సంస్కృతి పరిచయం..
టోర్నమెంట్ కోసం వస్తున్న 8 దేశాల ప్లేయర్లకు తెలంగాణ వారసత్వాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసేందుకు కొన్ని కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అలాగే ప్లేయర్లకు వారసత్వ పర్యటనలు, వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.

