కలం, వెబ్ డెస్క్: ఆపరేషన్ రోరింగ్ లయన్‌లో భాగంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడుతోంది (Israel – Iran). ఆదివారం టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. శనివారం ఉదయం అమెరికాతో కలసి చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీతోపాటు మరో రక్షణ మంత్రి, ఐఆర్జీసీ చీఫ్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎదురుదాడులు ప్రారంభించిన ఇరాన్.. ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో క్షిపణులతో దాడి చేసింది. జెరూసలేం, టెల్అవీవ్, హైఫా నగరాలపై మిస్సైళ్లతో విరుచుపడింది. ఈ దాడుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ పౌరులు మరణించారు.
దీనికి ప్రతిగా ఈ తెల్లవారుజాము నుంచే ఇరాన్‌పై ఇజ్రాయెల్ తీవ్ర దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్‌తోపాటు ఇస్పహాన్ తదితర ముఖ్య పట్టణాలపై విమానాలు శరపరంపరగా బాంబులు జారవిడిచాయి. నిన్న జరిగిన దాడుల్లో ఇరాన్లో 200 మందికి పైగా చనిపోగా, ఈరోజు అంతకుమించి మరణాలు జరిగినట్లు వార్తాసంస్థ రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు, ఇరాన్ సైతం వెనక్కు తగ్గడం లేదు. ఒకవైపు ఇజ్రాయెల్ మీద దాడులు కొనసాగిస్తూనే, గల్ఫ్ కంట్రీస్లోని అమెరికా స్థావరాలపై మిస్సైళ్లు ప్రయోగిస్తోంది (Israel – Iran). దుబాయ్, అబుదాబి, మనామా, కువైట్, దోహాలపై తీవ్రంగా దాడులు చేస్తోంది. దీంతో ఆయా దేశాలు సైరన్లు మోగిస్తూ తమ పౌరులను హెచ్చరిస్తున్నాయి. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, షెల్టర్లలో ఉండాలని సూచిస్తున్నాయి. మరోవైపు ఈ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయులపై స్వదేశంలోని వాళ్ల కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ప్రధానమంత్రి జోక్యం చేసుకొని తమ వాళ్లను విడిపించాలని కోరుతున్నాయి.

