కలం, వెబ్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ (US – Israel) సంయుక్త దాడులను న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. ఈ దాడులు చట్టవిరుద్ధమైనవని, యుద్ధాన్ని ఇంకా విస్తరించే రీతిలో దాడులకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో జనాలు నివసించే నగరాలపై బాంబులు వేస్తూ, పౌరులను చంపుతూ మరో యుద్ధానికి నాంది పలికారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదని, తమకు శాంతి కావాలని చెప్పారు.
న్యూయార్క్ (New York)లో నివసిస్తున్న ఇరానీయుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జోహ్రాన్ (Zohran Mamdani) వెల్లడించారు. పోలీస్ కమిషనర్, భద్రతా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. సున్నిత ప్రాంతాల్లో ముందస్తుగా అదనపు గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇరానీయులు కూడా న్యూయార్క్ నగరంలో భాగమేనని, ఇక్కడ వాళ్లకు సంపూర్ణ భద్రత ఉంటుందని హామీ ఇచ్చారు.
దాడులపై మలాలా ఆందోళన
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ (Malala Yousafzai) కూడా ఈ దాడులను ఖండించారు. దక్షిణ ఇరాన్ (Iran)లోని మినాబ్ ప్రాంతంలోని బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో భారీ ప్రాణ నష్టం సంభవించిందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోవడానికి వెళ్లిన చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమన్నారు. దాడుల్లో సామాన్య పౌరులు, చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇక ఈ హింసను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ పాఠశాలలు, పౌరుల రక్షణకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
Read Also: ఐదున్నర దశాబ్దాల తర్వాత సొంతూరికి మల్లోజుల
Follow Us On: Pinterest

