కలం, వరంగల్ బ్యూరో : వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం (Warangal Airport) ఏర్పాటులో మొదటి నుంచి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. భూసేకరణ విషయంలో రైతులను ఒప్పించేందుకు రెవెన్యూ అధికారులు పెద్ద యుద్ధమే చేశారు. మొత్తానికి భూసేకరణ పూర్తి చేసి పనులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. ఎయిర్పోర్ట్ రన్‌వేను కుదిస్తున్నారనే ప్రచారం వరంగల్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
ఆరంభ శూరత్వం..
వరంగల్‌లో ఎయిర్పోర్ట్ (Warangal Airport) నిర్మాణం చేస్తున్నామని భారీస్థాయిలో ప్రచారం చేసుకున్న రాష్ట్ర కాంగ్రెస్, కేంద్ర బీజేపీ సర్కార్లు.. చివరికి రన్‌వే సైజును కేవలం 2.5 కిలోమీటర్లకే కుదిస్తున్నారనే ప్రచారంతో వరంగల్ ప్రజలను నిరుత్సాహానికి గురిచేశాయి. కనీసం 2.9 కిలోమీటర్ల రన్‌వే ఉంటే తప్ప పెద్ద విమానాలు, అంతర్జాతీయ విమానాలు (వైడ్ బాడీ) దిగడానికి వీలు కాదు. అలాంటప్పుడు కేవలం 2.5 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో వరంగల్ విమానాశ్రయం కట్టాలని నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో 3.9 కిలోమీటర్ల ప్రతిపాదనలు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ ఎయిర్‌పోర్టును 3.9 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. అలా కట్టి ఉంటే ప్రపంచంలోని అతిపెద్ద విమానం కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యే సౌకర్యం ఉండేది. వరంగల్ ఎయిర్‌పోర్టు టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టులో కూడా రన్‌వే పొడవు 2.9 కిలోమీటర్లు ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ వారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కింజరపు రామ్మోహన్ నాయుడు సమావేశమైన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఎయిర్‌పోర్టు రన్‌వే పొడవును 2.5 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. అంటే దీని అర్థం వరంగల్ ఎయిర్‌పోర్టులో కేవలం చిన్న డొమెస్టిక్ విమానాలు మాత్రమే దిగేందుకు వీలుంటుంది. పెద్ద డొమెస్టిక్ విమానాలు కానీ, అంతర్జాతీయ విమాన సర్వీసులు కానీ నడపడానికి ఈ రన్‌వే సరిపోదు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వరంగల్ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడో వందేళ్ల క్రితం కట్టిన హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులోనే 3.2 కిలోమీటర్ల రన్‌వే ఉంది. ఇక 2008లో మొదలైన శంషాబాద్ విమానాశ్రయం రన్‌వే ఏకంగా 4.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పక్క రాష్ట్రంలోని విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే పొడవు 3.36 కిలోమీటర్లు ఉండగా, వైజాగ్ విమానాశ్రయంలో రన్‌వే పొడవు 3.0 కిలోమీటర్లు ఉంది. మరి అత్యాధునికంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో కడతామంటున్న వరంగల్ ఎయిర్‌పోర్టును కేవలం 2.5 కిలోమీటర్ల బుజ్జి రన్‌వేతో కడితే ఏం ప్రయోజనం అనే చర్చ నడుస్తోంది.
Read Also: మావోయిస్టు సాంబయ్య సరెండర్.. మరో 14 మంది సైతం
Follow Us On : WhatsApp

