కలం, వెబ్ డెస్క్: పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్ (KTR) కీలక సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. శనివారం జీహెచ్ఎంసీకి సంబంధించిన ముఖ్య నాయకులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నగర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
మౌలిక వసతులు, ట్రాఫిక్ సమస్యలు, డ్రైనేజ్, తాగునీటి సరఫరా వంటి అంశాలను అసెంబ్లీలో బలంగా ప్రస్తావించాలని నాయకులకు సూచించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు పార్టీ తరఫున చేపట్టాల్సిన ఉద్యమ కార్యక్రమాలపై కూడా దిశానిర్దేశం చేశారు. నగర ప్రజలతో మరింత అనుసంధానం పెంచుకుని పార్టీ కార్యకలాపాలను చురుకుగా కొనసాగించాలని ఆయన సూచించినట్లు సమాచారం.
రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమన్వయం, ఫాలోఅప్ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వివిధ కార్పొరేషన్‌ల బాధ్యతలను కీలక నాయకులకు అప్పగించారు.
నేతలకు ముఖ్య బాధ్యతలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలను ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, కర్నె ప్రభాకర్‌లకు అప్పగించారు. మల్కాజిగిరి కార్పొరేషన్ బాధ్యతలను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు అప్పగించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించారు. పార్టీ నిర్మాణాన్ని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయడం, బూత్ స్థాయి వరకు సమన్వయాన్ని పెంచడం, ఎన్నికల దిశగా ముందస్తు కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. నగర పరిధిలో పార్టీ కార్యకలాపాలను నిరంతరం సమీక్షిస్తూ ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే విధంగా నాయకులు పనిచేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. నగర రాజకీయ పరిస్థితులపై సమగ్ర సమీక్ష అనంతరం రాబోయే రోజుల్లో కార్యాచరణను వేగవంతం చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.

