కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దేవాలయాలపై పగబట్టాడని, పొద్దున లేచింది మొదలు ఎక్కడో ఓ చోట కూల్చివేతలు చేపట్టకపోతే ఆయన కుదురుగా ఉండలేరంటూ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. కోకాపేట్ నియోపోలీస్‌లోని విశాఖ శారద పీఠాన్ని నేడు హరీష్ రావు సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని హరీశ్ ఆరోపించారు. మరోవైపు ఇప్పటికే ఆలయం వద్దకు రెవెన్యూ, పోలీసు అధికారులు భారీ ఎత్తున చేరుకున్నారు. హరీశ్ రావు రాకతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలయ నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయించామని హరీశ్ రావు తెలిపారు. దేవాలయ స్థలాన్ని లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. పీఠం నిర్వాహకులను భయాందోళనలకు గురి చేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డికి కూల్చివేతలు చేయకపోతే నిద్ర పట్టదని, ఇటీవల ఖమ్మంలో కూడా ఇలాగే పేదల ఇండ్లు కూల్చేశారని చెప్పారు. ధర్మాన్ని ప్రచారం చేసే శారదా పీఠాన్ని ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి స్థానికంగా తన అల్లుడికి అక్రమంగా భూమి కట్టబెట్టారని ఆరోపించారు.కోకాపేటలో మైనింగ్ కోసం భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైనింగ్ వాళ్లకు పది ఎకరాలు కేటాయిస్తే 17 ఎకరాలు కబ్జా పెట్టారని ఆరోపించారు. ఓఆర్ఆర్‌కు కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయొద్దని ఉన్న హెచ్ఎండీఏ చెప్పినా అక్రమంగా మైనింగ్ కోసం రేవంత్ రెడ్డి తన అల్లుడికి అప్పజెప్పాడని ఆరోపించారు. భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైనింగ్ వెనక రేవంత్ రెడ్డి మేనల్లుడు రమేష్ రెడ్డి, దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డిలు ఉన్నారని ఆరోపణలు చేశారు. వాటర్ వెల్స్ కట్టడానికి మేనల్లుడికి ఇచ్చిన 17 ఎకరాల భూమి పనికి రాదా అని ప్రశ్నించారు.
రాత్రి 11 గంటలకు పోలీసులు, ఎమ్మార్వో ఆలయం దగ్గరకు వచ్చారన్నారు. కనీసం భూమి తీసుకుంటున్నారని ఇక్కడి వాళ్లకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. పోలీసులు, అధికారుల రాకతో భయంతో శారదా పీఠం వారు ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చానని హరీశ్ అన్నారు. అయితే పోలీసులు తనను చూసి పారిపోయినట్లు హరీశ్ రావు వెల్లడించారు.

