కలం, తెలంగాణ బ్యూరో : విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా రానున్న బడ్జెట్ (Budget)లో నిధులను ఎక్కువగానే కేటాయించాలనుకుంటున్నది. అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఇప్పటికే చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ సమీక్షించారు. మరోవైపు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా గత బడ్జెట్ కంటే ఈసారి విద్యారంగానికి నిధులను ఎక్కువగా కేటాయించే అవకాశమున్నది. గత బడ్జెట్లో రూ. 23 వేల కోట్లను కేటాయించగా ఈసారి దాన్ని కనీసంగా రూ. 25 వేల కోట్లకు ఫిక్స్ చేయాలని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే విద్యార్థులకు ‘సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్’ గురించి రివ్యూ చేసిన సీఎం రేవంత్రెడ్డి.. స్కూల్ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, ఇతర అవసరాలను కూడా ప్రభుత్వం సమకూర్చనున్నట్లు తెలిపారు.
ఉస్మానియా వర్శిటీకి ఈసారి రూ. 500 కోట్లు :
ఉస్మానియా యూనివర్శిటీకి రానున్న బడ్జెట్లో ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించనున్నది. ఈ యూనివర్శిటీకి వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారు. ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రూపంలో రూ. 500 కోట్లను రానున్న బడ్జెట్లో పెట్టనున్నది. ఒకేసారి వెయ్యి కోట్లు ఇచ్చినా భవన నిర్మాణాలతో పాటు ఇతర అవసరాలను ఒకే ఏడాదిలో ఖర్చు చేయడం వీలుకాదన్న ఉద్దేశంతో తొలుత రూ. 500 కోట్లనే కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. మిగిలిన రూ. 500 కోట్లను 2027-28 బడ్జెట్లో కేటాయించనున్నట్లు తెలిపాయి.

