కలం, వెబ్ డెస్క్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ‘ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్’ దెబ్బకు మరో వికెట్ పడింది. ప్రపంచ ఆర్థిక వేదిక సీఈవో బోర్గ్ బ్రెండే (Borge Brende) రాజీనామా చేశారు. ఇప్పటికే ఈ వివాదం కారణంగా బ్రిటన్ మాజీ ప్రిన్స్ ఆండ్రూ తన రాచరిక గౌరవాలను, బిరుదులను కోల్పోవడంతోపాటు అరెస్ట్ కావడం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో బ్రెండే బోర్గ్ కూడా చేరారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(WEF)కు 2017 నుంచి ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ఆయన గురువారం తన పదవి నుంచి దిగిపోయారు.
కాగా, అమాయక యువతులను, బాలికలను ఎరవేసి తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న అమెరికా మాజీ ఫైనాన్సియర్ ఎప్స్టీన్ దురాగతాలు కొన్నేళ్ల కిందట బయటపడిన సంగతి తెలిసిందే. అనంతరం జైల్లో శిక్ష అనుభవిస్తూ ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం, అతని అకృత్యాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, ఉత్తరప్రత్యుత్తరాలు, మెయిల్స్ వంటివి అమెరికా న్యాయశాఖ ప్రస్తుతం బయటపెడుతోంది. ఎప్స్టీన్ పాపాల్లో ఎంతో మంది బిలియనీర్లు, రాచకుటుంబాల వ్యక్తులు, అత్యున్నత పదవుల్లో ఉన్నవాళ్లు, క్రీడా, సినిమా రంగాల ప్రముఖులకు భాగం ఉన్నట్లు ఇవి వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా బోర్గ్ బ్రెండే పేరు సైతం ఎప్స్టీన్ ఫైల్స్‌లో కనిపించడంతో కలకలం రేగింది.
అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఫైల్స్ ప్రకారం.. ఎప్స్టీన్తో కలసి బోర్గ్ బ్రెండే (Borge Brende) మూడుసార్లు బిజినెస్ డిన్నర్లో పాల్గొన్నారు. అంతేకాదు, మెయిల్స్, మెసెజ్‌ల ద్వారా అనేక సార్లు సంప్రదింపులు జరిపారు. దీంతో బోర్గ్పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అతను రాజీనామా చేయాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో తన పదవులకు రిజైన్ చేస్తున్నట్లు బోర్గ్ ప్రకటించారు. ‘దాదాపు 8 నుంచి 12 ఏళ్లు డబ్ల్యూఈఎఫ్‌కు ప్రెసిడెంట్‌గా, సీఈవోగా సేవలందించాను. ఇక దిగిపోవాల్సిన సమయం వచ్చింది. ఇది ఆలోచించి తీసుకున్న నిర్ణయం ’ అని తన రాజీనామా లేఖలో బోర్గ్ పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక ప్రగతిలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగే వరల్డ్ ఎకనమిక్ సమ్మిట్‌ను నిర్వహించేది ఇదే. ఈ సంస్థకు నార్వేకు చెందిన బోర్గ్ దాదాపు పదేళ్లకు పైగా అధినేతగా ఉన్నారు. ఇప్పుడు ఆయన రిజైన్ చేయడంతో ప్రస్తుతం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తాత్కాలిక ప్రెసిడెంట్, సీఈవోగా అలోయిస్ జ్వింగీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

