కలం, వెబ్ డెస్క్ : బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న (Basara Student) వసంత ఆత్మహత్య ఘటనలో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం అన్నారం తండాకు చెందిన చిట్టెమ్మ, లోక్యనాయక్ దంపతుల కుమార్తె అయిన వసంత, తన మేనత్త కుమారుడు గణేష్ నాయక్ మరణవార్త విని మనస్తాపంతో తనువు చాలించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
గత కొంతకాలంగా వసంతను ప్రేమిస్తున్న గణేష్ నాయక్, తనను వివాహం చేసుకోవాలని కోరాడు. అయితే చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని వసంత చెప్పడంతో మనస్తాపానికి గురైన గణేష్ నాయక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వసంత తీవ్ర భయాందోళనకు గురైందని, మొదట మెడపై గాట్లు పెట్టుకుని ఆ తర్వాత హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుందని పోలీసులు పేర్కొన్నారు. వసంత చేసిన చివరి ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

