కలం, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ (Tirumala Laddu)లో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Rama Narayana Reddy) అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. టీడీపీ హయాంలో 2019లో టెండర్ నిబంధనలను పటిష్టం చేశారని చెప్పారు. ఈ నిబంధనలు వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020లో సడలించారన్నారు. దీని వల్లే ప్రైవేటు డైరీలు టీటీడీలోకి వచ్చాయని తెలిపారు. రూ.319కు కేజీ నెయ్యి సరఫరా చేయడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. అలాగే నెయ్యి పరీక్షా విధానాలకు సరైన పరిమితులు లేవని చెప్పారు. ఎన్డీడీబీ తొలి నివేదికలో వనస్పతి, జంతువుల కొవ్వు ఉందని రిపోర్టు వచ్చిందని తెలిపారు. పరీక్షల్లో తిరస్కరించిన నెయ్యిని తిరిగి టీటీడీకి సరఫరా చేశారని వెల్లడించారు. మంత్రి ఆనం వ్యాఖ్యలకు వైసీపీ (YSRCP) ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.
సిట్ నివేదికకు కీలకంగా ఉన్న నెయ్యి ఎప్పుడు సరఫరా అయ్యింది? ఎప్పుడు శాంపిళ్లు స్వీకరించారు, పరీక్షలు చేసి తిరిగి వెనక్కి ఎప్పుడు పంపించారన్న అంశాలను ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం తమ ప్రకటనలో పొందుపర్చలేదని వైసీపీ పోస్టులో పేర్కొంది. కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి పూర్తి వివరాలతో ఓ టైమ్‌లైన్‌ను పోస్ట్ చేసింది. ఈ ప్రక్రియ మొత్తం సీఎం చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆరోపించింది.
ఏఆర్ డైరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా జరిగిన వివరాలను ఇందులో పొందుపర్చారు. వైసీపీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులోని వివరాల ప్రకారం..
– మార్చి 16, 2024న రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
– మే 13, 2024న రాష్ట్రంలో పోలింగ్ జరిగింది.
– మే 15, 2024న పోలింగ్ ముగిసిన 2 రోజులకు టెండర్లు తెరిచారు.
– ఏఆర్ డైరీకి సరఫరా ఆర్డర్ జారీ చేశారు.
– జూన్ 4, 2024న ఎన్నికల ఫలితాలు ప్రకటించడంతో ప్రభుత్వం మారింది.
– జూన్ 12, 2024న ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా ప్రారంభించింది.
– జూన్ 12, 20, 25, జూలై 4, 2024లో నాలుగు ట్యాంకర్లు పంపించారు. ఇవన్నీ పరీక్షల్లో పాస్ అయ్యాయి.
– జూలై 6, 12, 2024న నాలుగు ట్యాంకర్లు ఏఆర్ డైరీ ద్వారా పంపించారు. ఇవి పరీక్షలో విఫలమయ్యాయి.
– జూలై 23, 2024న ఎన్డీడీబీ నివేదిక అందింది.
– జూలై 25, 2024న పరీక్షలో విఫలమైన నాలుగు ట్యాంకర్లను తిరిగి పంపిపంచేశారు.
– జూలై 27, 2024న తిరస్కరించిన నాలుగు ట్యాంకర్లు శ్రీకాళహస్తి స్టోన్ క్రషర్ వద్ద ఆపేశారు.
– సీబీఐ, సిట్ చార్జ్ షీట్ ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్‌లో రహస్యంగా ఆ నాలుగు ట్యాంకర్లను తిరిగి టీటీడీకి ఉదయం 4 గంటలకు సరఫరా చేశారు.
– సెప్టెంబర్ 18, 2024న చంద్రబాబు నాయుడు ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపల నూనె ఉన్నాయని ఆరోపించారు.
దీంతో పాటు ఏపీ అసెంబ్లీలో తిరుమల లడ్డూపై చర్చ జరుగుతున్నంత సేపు వైసీపీ ఎక్స్ వేదికగా వరుస పోస్టులు చేస్తూ కౌంటర్లు ఇస్తూనే ఉంది.

