కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించేలా మంత్రివర్గం (Telangana Cabinet) కీలక నిర్ణయం తీసుకున్నది. ఏదేని కారణాలతో సర్వీసులో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేలా ప్రత్యేక పాలసీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. వారం రోజుల వ్యవధిలోనే అది కొలిక్కి రానున్నది. మృతుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి రూ. 1.25 కోటి మేర పరిహారం అందేలా ప్రభుత్వం తన సొంత ఖర్చుతో ప్రీమియంను చెల్లించనున్నది. ఈ మేరకు క్యాబినెట్ లోతుగా చర్చించి ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక్క రూపాయి కూడా భారం కాకుండా పాలసీపై ఆలోచించినట్లు మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. ఈ పాలసీ కారణంగా సుమారు 7.56 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
సింగరేణి, జెన్కో తరహాలోనే నూతన పాలసీ
ప్రస్తుతం సింగరేణి, తెలంగాణ జెన్కో సంస్థల్లో ప్రమాద బీమా పాలసీ (Accident Insurance) అమలవుతున్నదని గుర్తుచేసిన మంత్రి పొంగులేటి… ఇకపైన రాష్ట్రంలోని అన్ని డిపార్టుమెంట్లలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తింపజేసేలా లోతుగా చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనికి తోడు 60 సంవత్సరాల వయసులోపు సర్వీసులో ఉన్న ఉద్యోగులు ఏ కారణంతో చనిపోయినా ప్రభుత్వం నుంచి రెగ్యులర్‌గా అందే పింఛనుతో పాటు అదనంగా రూ. 10 లక్షల మేర ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఆర్థిక సాయం అందేలా స్కీమ్‌ను రూపొందిస్తున్నట్లు వివరించారు.


