కలం, ఖమ్మం బ్యూరో : యాభై ఏళ్ల నాటి నిద్రమాను (Nidra Maanu) చెట్ల మాయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ అధికారులకు ఫిర్యాదు అందింది. జిల్లాలోని మణుగూరు పట్టణంలో కొన్ని రోజులుగా ఈ వృక్షాలను గుర్తుతెలియని వ్యక్తులు కొట్టివేసి తరలిస్తున్నారు. పర్యావరణం పరంగానూ, సంప్రదాయ వైద్యంలోనూ ఎంతో ఉపయోగపడే ఈ చెట్లను మాయం చేస్తున్నవాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కేఎస్ఎన్ మూర్తికి పర్యావరణ ప్రేమికుడు కర్నె బాబురావు ఫిర్యాదు చేశారు.
నిద్రగన్నేరు (Nidra Maanu) లేదా నిద్రమానుగా పిలుచుకునే ఈ చెట్టు లెగ్యూమ్ జాతికి చెందింది. ఈ చెట్టు ఆకులు సాయంత్రం, వర్షం పడే సమయంలో ముడుచుకుంటాయి. అందుకే దీనికి ‘నిద్రమాను’ అని పేరు వచ్చింది. ఈ చెట్టు కొమ్మలు గొడుగులా వ్యాపించి చక్కటి నీడనిస్తాయి. అందుకే వీటిని రోడ్లకు ఇరువైపులా, పార్కుల్లో ఎక్కువగా పెంచుతారు. నేలలో నత్రజనిని స్థిరీకరించి, భూమిని సారవంతం చేయడంలో ఈ చెట్టు సమర్థంగా పనిచేస్తుంది. తియ్యగా ఉండే వీటి కాయల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. పశువులు, మేకలు, గొర్రెలు ఇష్టంగా తింటాయి. సంప్రదాయ వైద్యంలో నిద్రమాను ఆకులు, బెరడును కొన్ని రకాల చర్మ వ్యాధులు, విరేచనాలు, కడుపు నొప్పి నివారణకు ఉపయోగిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టత ఉన్న వృక్షాలను నరికి వేసి, తరలిస్తుండడంపై ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


